ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేవాలయాల ఉద్యమాలకు దూరంగా ఉంటామని, గతంలో జరిగిందేదో జరిగిందని, చరిత్రను మార్చలేమని అన్నారు. కాశీలోని జ్ఞాన్వాపీ మసీదులో శివలింగం, తాజ మహల్, మధుర వంటి వివాదాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగవత్ ప్రసంగించారు. ‘‘ప్రతి మసీదు కింద శివలింగాన్ని ఎందుకు వెతుకుతారు? జ్ఞాన్ వాపీ మసీదు చరిత్రను మార్చలేం. ఈనాటి హిందువులు, ముస్లింలు ఆ వివాదానికి కారణం కాదు. ఈ దేశంలోకి ఇస్లాం దాడులతో ప్రవేశించింది. మానసికంగా గాయపర్చడానికి హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. నేటి ముస్లింలు కూడా ఒకప్పటి హిందువులే. ప్రార్థన మందిరాల విషయంలో పరస్పర అంగీకారంతో ముందుకు సాగాలి. కోర్టుల తీర్పును గౌరవించాలి. అంతేగాని ప్రతి మసీదులో శివలింగం కోసం చూడొద్దు. బయటి నుంచి ప్రవేశంచిన ఏ మతమైనా అదీ ఒక ఆరాధన విధానమే. వారేమీ బయటివాళ్లు కాదు, ముస్లింలు కూడా ఈ సంగతి అర్థం చేసుకోవాలి. మేం మతానికి వ్యతిరేకం కాదు’ అని భాగవత్ అన్నారు.