RSS chief meeting with Muslim religious leaders in delhi
mictv telugu

ముస్లిం మత పెద్దలతో ఆరెస్సెస్ చీఫ్ భేటీ.. గో హత్య నిషేధంపై క్లారిటీ

September 22, 2022

బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగత్ ఢిల్లీలోని ముస్లిం మత పెద్దలతో సమావేశమవడం సంచలనం రేపింది. నగరం నడి బొడ్డున ఉన్న మసీదులో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసీతో గంట పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో ఏం చర్చించారన్నది బయటికి రాలేదు కానీ, ఈ భేటీ దేశానికి మంచి సందేశం పంపుతుందని ఇలియాసీ అన్నారు. తామంతా ఓ కుటుంబంలా చర్చించామని, తమ ఆహ్వానాన్ని మన్నించి మోహన్ భగత్ సమావేశానికి రావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. అంతేకాక, మోహన్ భగత్‌ను ఇలియాసీ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను రాష్ట్రపిత, రాష్ట్ర రుషి అని సంబోధించారు. భేటీ తర్వాత మోహన్ భగత్ అక్కడున్న మదర్సాను సందర్శించి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. అయితే ఇక్కడే మరో కీలక విషయం వెలుగు చూసింది. ఈ భేటీకి ముందే ఆగస్టు 22న మోహన్ భగత్ ఐదుగురు ముస్లిం మేధావి వర్గానికి చెందిన వారితో సమావేశమయ్యారు. ఇందులో మాజీ ఎన్నికల కమిషనర్ సయ్యద్ ఖురేషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఆలీఘర్ విశ్వవిద్యాలయం మాజీ వీసీ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీలు పాల్గొన్నారు. ఈ మీటింగులో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. వాటిలో గో హత్య, కాఫిర్, ముస్లింలను జిహాదీలు, పాకిస్తానీలు అని సంబోధించడం వంటి వివాదాస్పద అంశాలపై చర్చ జరిగింది.

గో హత్య వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మోహన్ భగత్ అభిప్రాయపడగా, ఈ విషయంలో చట్టం చేసి దేశ వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని ముస్లిం మేధావుల బృందం కోరింది. ముస్లింలు చట్టాన్ని గౌరవిస్తారని, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. అలాగే ముస్లిమేతరులను కాఫిర్ అని సంబోధించడం పట్ల ఆరెస్సెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇస్లాంను నమ్మే వారిని ‘మోమిన్’ అని, నమ్మని వారిని ‘కాఫిర్’ అని అరబ్బీలో పిలుస్తారని, కానీ ఇప్పుడు దానిని వేరే అర్ధంలో వాడుతుండడంతో అపోహలు పెరిగాయన్నారు. ఈ పదం వాడొద్దన్న సూచనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇక ముస్లిం వర్గం నుంచి వచ్చిన అభ్యంతరాలు చూస్తే ముస్లింలమైనందుకు తమను జిహాదీలు, పాకిస్తానీలు అని తరచూ పిలుస్తున్నారని, ప్రతీసారి తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సి వస్తోందని వాపోయారు. దీనికి మోహన్ భగత్ అంగీకారం తెలుపుతూనే ‘మతం మారారు అని తప్ప మీకు మాకు ఎలాంటి జన్యుపరమైన భేదాలు లేవు. దేవుడిని ప్రార్ధించడంలోనే తేడాలు ఉన్నాయి. మనమందరం ఓకే డీఎన్ఏ కలిగి ఉన్న ఒకే జాతికి చెందిన వాళ్లం’ అని మోహన్ భగత్ అన్నట్టు ఖురేషీ పేర్కొన్నారు. హిజాబ్ ఆందోళన, నుపుర్ శర్మ వ్యాఖ్యలు, ప్రతీ మసీదు కింద శివలింగాన్ని వెతకండి అన్న మోహన్ భగత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇలాంటి వరుస సమావేశాలు జరగడం పట్ల ఇరు వర్గాల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో పెరుగుతున్న విద్వేష వాతావరణానికి ఈ చర్చలు ప్రతికూలంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఒక వర్గాన్ని దూరం చేసి ఈ దేశం సంపూర్ణ అభివృద్ధి సాధించదని మోహన్ భగత్ సమావేశం అనంతరం వెల్లడించారు.