RSS chief Mohan Bhagat visited the mosque under the influence of Bharat Jodo Yatra: Digvijay Singh
mictv telugu

‘‘ప్రధాని మోదీ ముస్లిం టోపీ ధరించే రోజు దగ్గర్లోనే ఉంది’’

November 15, 2022

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం కారణంగానే ఆర్ఎస్ఎస్ అధినేత మసీదులు, మదర్సాలలో పర్యటిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని విమర్శించడంలో బీజేపీ యమ బిజీగా ఉందని, కానీ యాత్ర ప్రారంభమైన నెలరోజుల్లోపే మోహన్ భగత్ మసీదులు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాక, మరికొద్ది రోజుల్లో ప్రధాని మోదీ సైతం ముస్లిం టోపీ ధరిస్తారని వ్యాఖ్యానించారు. ఇండోర్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాగా, గత సెప్టెంబరులో మోహన్ భగత్ పలువురు ముస్లిం మేధావులను కలుసుకున్నారు. ఆలిండియా ఇమామ్ సంఘం అధ్యక్షుడు అహ్మద్ ఇల్యాసీతో భేటీ అయ్యారు. అనంతరం మదరసా సందర్శించి అక్కడి పిల్లలతో సరదాగా సంభాషించారు. అయితే ఈ పరిణామం పీఎఫ్ఐని నిషేధించిన నేపథ్యంలో జరిగిందని అంతా అనుకున్నారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ మరో భాష్యం చెప్పడం గమనార్హం. కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. గిరిజన స్వాతంత్ర్య యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా రాహుల్ ఆయనకు నివాళులర్పించారు. ఆయన ఆదర్శాలపై బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి నలువైపులా దాడి చేస్తున్నారని విమర్శించారు.