రిజర్వేషన్లపై చర్చ జరగాల్సిందే.. ఆరెస్సెస్ చీఫ్  - MicTv.in - Telugu News
mictv telugu

రిజర్వేషన్లపై చర్చ జరగాల్సిందే.. ఆరెస్సెస్ చీఫ్ 

August 19, 2019

RSS chief Mohan Bhagwat.

రిజర్వేషన్లపై శాంతియుత చర్చలు జరగాలని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘జ్ఞాన్ ఉత్సవ్’ ముగింపు సభలో ఆయన ప్రసంగిస్తూ, రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. రిజర్వేషన్ల మద్దతురారుల భావాలనే కాకుండా, వాటిని వ్యతిరేకిస్తున్న వారి భావాల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. రిజర్వేషన్లపై తాను ఎప్పుడు మాట్లాడినా వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తోందని తెలిపారు. గతంలో తాను ఇదే విషయంపై మాట్లాడినప్పుడు.. అది పూర్తిగా తప్పుదోవ పట్టిందని పేర్కొన్నారు. 

ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్లపై శాంతియుత చర్చలు జరగాలని స్పష్టంచేశారు. ‘రిజర్వేషన్ల అమలు విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. రిజర్వేషన్లను రూపొందించే సమయంలో కొన్ని వర్గాలు తమకు అనకూలంగా వాటిని మలచుకున్నాయి. మెజారిటీ వర్గ ప్రజల గళాన్ని వినిపించకుండా చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ.. మేం దానికి వ్యతిరేకం కాదు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకోగల సామర్థ్యాన్ని సమకూర్చుకున్నారు. ఆ ఇద్దరూ తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా దేశం మొత్తం హర్షిస్తుంది. ఇదే ఊపులో రిజర్వేషన్ల వ్యవస్థను కూడా సమీక్షించాల్సిన అవసరం, సమయం ఏర్పడింది’ అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.  

గతంలో మోహన్ భగవత్ రిజర్వేషన్లపై పున:సమీక్షించాలని కోరగా, పెను దూమారమే రేగింది. వివిధ కుల, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ఆ తర్వాత ఆయన మరెప్పుడూ రిజర్వేషన్ల అంశంపై స్పందించలేదు. మరి ఆయన వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.