ఆర్టీసీ బస్సులో మోదీ.. ఆశ్చర్యపోయిన ప్రయాణీకులు
మీరు చూస్తున్న ఈ ఫొటో ప్రధాని నరేంద్రమోదీ అనుకునేలా ఉంది కదూ. ప్రధానిగా ఉన్న ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కి ఏం చేస్తున్నారు అనే ప్రశ్న అందరికి వస్తుంది. కానీ ఆయన ప్రధాని మోదీ మాత్రం కాదు. ప్రధాని పోలికలతో కనిపించే ఆర్టీసీ బస్సు డ్రైవర్. ఆయన బస్సు ఎక్కిన వెంటనే అందులో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూశారు.
ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన ఇతని పేరు షేక్ అయ్యూబ్. చాలా కాలం నుంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ జుట్టు, ముఖ కవళికలు, నడక అన్నీ మోదీలా ఉంటాయి. దీంతో ఆయన ప్రధాని అవతారంలో తయారు కావడం ప్రారంభించారు. అప్పటి నుంచి అంతా అతన్ని జూనియర్ మోదీ అంటూ పిలుస్తున్నారు. సెల్పీలు తీసుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. అయూబ్‌ను మోదీ బయోపిక్ తీసేందుకు ఓ సినిమా దర్శకుడు కూడా కలిసినట్టు చెబుతున్నాడు. ఏమైనా ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేదానికి ఇదే ఉదహారణ ఏమో అని అంతా చర్చించుకుంటున్నారు.