అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. డివైడర్ పైకి దూసుకెళ్లింది - MicTv.in - Telugu News
mictv telugu

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. డివైడర్ పైకి దూసుకెళ్లింది

November 24, 2019

తాత్కాలిక ఆర్టీసీ బస్సు డ్రైవర్ల పనితీరు ప్రయాణికులను ప్రతి రోజూ భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. ఏదో ఒక చోట బస్సులు ప్రమాదాలకు గురికావడమో, డ్రైవర్ల అవగాహన లోపంతో మొరాయించడమో పరిపాటిగా మారిపోయింది. తాజాగా హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి అపాయం జరగలేదు. 

RTC Bus Rush.

జీడిమెట్ల డిపోకు చెందిన బస్సు గండి మైసమ్మ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వస్తోంది. ఆ సమయంలో మార్గ మధ్యలో చింతల్ గణేశ్‌నగర్‌లో రాగానే ఓ బైక్ బస్సుకు అడ్డువచ్చింది. దాన్ని తప్పించాలనే వేగంలో తాత్కాలిక డ్రైవర్ ప్రతాపరెడ్డి డివైడర్ ఎక్కించాడు. వెంటనే అది నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు, బైక్ స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటి నుంచి ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యం కోసం తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.