RTC bus suddenly failed, the driver acted on time and saved the lives of the passengers
mictv telugu

ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. డ్రైవర్ చేసిన పనికి అభినందనలు

October 20, 2022

ప్రయాణికులతో ఘాట్‌ రోడ్డులో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సు డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించాడు. 36 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో వాలమూరు సమీపంలోకి వచ్చే సరికి బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ సుబ్బారావు గుర్తించారు. వెంటనే అందులోని మరో డ్రైవర్‌, 36 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

రెండు ప్రమాదకర మలుపులు వెళ్లాక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే ఉన్న మట్టి దిబ్బను ఢీకొట్టారు. లేకుంటే రోడ్డుకు ఇటువైపు ఉన్న సుమారు 100 అడుగుల లోయలోకి బస్సు దూసుకుపోయి పెనుప్రమాదం సంభవించేది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం లోపలికి చొచ్చుకొచ్చి, డ్రైవర్‌ కాళ్లు అందులోనే ఇరుక్కుపోయాయి. 2 గంటలపాటు క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డాడు. ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మారేడుమిల్లి పోలీసులు, లారీ యూనియన్‌ ప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి లారీతో బస్సును వెనక్కి లాగి డ్రైవర్‌ను బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి బస్సును కొండకు ఢీకొట్టించి ఆపడం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు డ్రైవర్‌ సుబ్బారావును అభినందించారు. స్వల్పగాయాలకు గురైన వారికి మారేడుమిల్లి పీహెచ్‌సీలో చికిత్స అందించారు.