ప్రైవేట్ డ్రైవర్ నిర్వాకం.. వాగులో ఆర్టీసీ బస్సు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రైవేట్ డ్రైవర్ నిర్వాకం.. వాగులో ఆర్టీసీ బస్సు

October 9, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే వారికి బస్సులు నడపడంలో సరైన అనుభవం లేకపోవడంతో వాటిని చెట్లను గుద్దేస్తున్నారు. ఓచోట బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న స్తంభానికి గుద్దుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటనలో బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట్ దుందుభి వాగు వద్ద చోటు చేసుకుంది. తెల్కపల్లి వెళ్తున్న ప్రైవేట్ ఆర్టీసీ బస్సు దుందుభి వాగు సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. బస్సు ఒకవైపుకు వంగిపోయి సడెన్‌గా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సులో నుంచి  దిగేసి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

RTC bus.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో  దుందిబి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో తెల్కపల్లి – కల్వకుర్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో దారులపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమ్మెపై ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, కండెక్టర్లుగా నియమించబడ్డవారు ప్రయాణికుల వద్ద డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడంలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.