ఏపీలో రేపట్నుంచి రోడ్లపైకి బస్సులు.. షాపులు ఓపెన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రేపట్నుంచి రోడ్లపైకి బస్సులు.. షాపులు ఓపెన్

May 19, 2020

AP

రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీలో ప్రజా రవాణా ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలన్నీ ప్రారంభం అవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టంచేశారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించడంలో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వాములు కావాలని సూచించారు. ఏపీలో సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు తప్ప మిగిలిన అన్నింటినీ తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ తెరవాలి. మాస్క్, భౌతిక దూరం.. ఈ రెండు నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ.. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాలి. రాబోయే రోజుల్లో కూడా మనం కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కరోనా సోకినవారిని వివక్షతో చూడటాన్ని సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కరోనా సోకిన వారిని వివక్షతో చూడకూడదు. రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో అని అనిపిస్తోంది.  కరోనా అనేది వస్తుంది.. పోతుంది. కాబట్టి ఆ వైరస్ పట్ల భయాన్ని తొలగించాలి. ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.