కండక్టర్ కాదు, కామభూతం.. చెక్ పెట్టిన బస్ టికెట్ - MicTv.in - Telugu News
mictv telugu

కండక్టర్ కాదు, కామభూతం.. చెక్ పెట్టిన బస్ టికెట్

March 23, 2018

బస్సులో జనం రద్దీని అదనుగా తీసుకుని అమ్మాయిలను, మహిళలను గలీజు చేష్టలతో వేధిస్తున్న కండక్టర్ పాపం పండింది. అతని వేధింపులకు గురైన ఓ విద్యార్థిని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడంతో పోలీసుల కేవలం కొన్ని గంటల్లో వాడి ఆచూకీ కనుక్కుని కటకటాల వెనక్కి నెట్టారు. బస్సు టికెట్ ఈ కేసులో కీలక పాత్ర పోషించింది.

హైదాబాద్ బండ్లగూడ డిపోకు చెందిన 50 ఏళ్ల శ్రీనివాస్ గుప్తా హయత్ నగర్ మెహదీ పట్నం రూట్లో తిరిగే బస్సులో కండక్టర్. టికెట్ల కొట్టడం వృత్తి అయితే, ఆడవాళ్ల మధ్యదూరి వాళ్లను అసభ్యంగా తాకడం ప్రవృత్తి. రోజూ ఇదే తతంగం. ఓ విద్యార్థినిని అతడు కొన్నాళ్లుగా రోజూ వేధిస్తున్నాడు. ఆమె అతని కీచకాన్ని వీడియో తీసి పోలీసులకు పంపిద్దానుకుంది. అయితే రద్దీగా ఉండడం, వీడియో తీస్తే ఏమైనా అయితుందనే భయంతో వెనుకంజ వేసింది. చివరికి శ్రీనివాస్ గుప్తా ఇచ్చిన టెకెట్ నంబర్ వివరాలను రాచకొండ షీ టీమ్ వాట్సాప్ కంట్రోల్ నంబర్ 9490617111కు పంపింది.

ఈ చిన్న క్లూతో ఏఎస్ఐ యాదయ్య నేతృత్వంలోని షీ టీఎం ఏడీసీపీ ఎస్కే సలీమా పర్యవేక్షలో రంగంలోకి దిగింది. AP 11 Z 45 టికెట్ ఇచ్చిన బస్సు వివరాలను తెలుసుకుని గుప్తాను పట్టుకుంది. అతడు నేరం అంగీకరించాడు. వనస్థలిపురం ఠాణాలో అతనిపై కేసు పెట్టారు పోలీసులు. లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులు మౌనంగా ఉండొద్దని తమ ఫోన్ నంబర్లకు, 100 నంబరుకు ఫోన్ చేయాలని, వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని పోలీసులు చెప్పారు.