ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ.. బస్సులో దొరికిన పర్సును.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ.. బస్సులో దొరికిన పర్సును..

October 24, 2020

c yiyhu

రోడ్డు మీద ఎవరో పొరపాటున పోగొట్టుకున్న సొమ్ము దొరికిందని పండగ చేసుకునేవారు ఉన్నారు. కానీ, కొందరు మాత్రం పరుల సొమ్మును పాములా భావించి పోగొట్టుకున్నవారికి అప్పజెప్పి నిజాయితీని చాటుకునేవారూ ఉన్నారు. తాజాగా సూర్యాపేట డిపో పరిధిలో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్‌ కోటయ్య నిజాయితీ చాటుకున్నాడు. సూర్యాపేట నుంచి హనుమకొండ వెళ్లే బస్సులో ఓ ప్రయాణికుడు పర్స్ పోగొట్టుకుని దిగిపోయాడు. అయితే ఆ పర్స్‌ను గుర్తించిన కోటయ్య దాని లోపల చూశాడు. అందులో రూ.9,060 ఉన్నాయి. ‘పాపం అతను ఈ డబ్బును పోగొట్టుకుని ఎంత బాదపడుతున్నాడో’ అని భావించిన కోటయ్య ఆ పర్సు, అందులోని నగదును తీసుకెళ్లి అసిస్టెంట్ మేనేజర్‌కు అందించాడు. పర్సులో గుర్తింపు కార్డుల ఆధారంగా, ఆ పర్సు పొగొట్టుకున్నది ఏపూరు గ్రామానికి చెందిన సంపత్‌గా గుర్తించారు. డీపోకు పిలిపించి అతని పర్సును అతనికి అందించారు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజాయితీని చాటుకున్న కోటయ్యను డిపో మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్‌తోపాటు ఉద్యోగులు అభినందించారు. 

కాగా, కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని పిడుగురాళ్ల సమీపంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇనుమట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి  గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కి విజయవాడలోని  కుమారుడి వద్దకు బయల్దేరాడు. ఐస్‌ ఫ్యాక్టరీ దగ్గర బస్‌ దిగిన సదరు వ్యక్తి తనవెంట తెచ్చుకున్న రూ.78 వేల కాష్‌బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో దొరికిన బ్యాగును చూసిన కండక్టర్, డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. బ్యాగును తీసుకువెళ్లి డిపో మేనేజర్‌కు అప్పగించారు. సత్యనారాయణను మంగళగిరికి పిలిపించి ఆయన బ్యాగును ఆయనకు అప్పజెప్పారు. తన బ్యాగును తనకు అప్పజెప్పినందుకు సత్యనారాయణ సదరు డ్రైవర్, కండక్టర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.