Home > Featured > ఫోనుపిచ్చి మైసయ్యో మైసయ్యా.. మా ప్రాణాలు తీస్తవా మైసయ్యా?

ఫోనుపిచ్చి మైసయ్యో మైసయ్యా.. మా ప్రాణాలు తీస్తవా మైసయ్యా?

డ్రైవర్లు ఎంతో జాగ్రత్తగా వాహనం నడపాలి. ఏమాత్రం ఏమరుపాటు చూపినా అతని కుటుంబంతో పాటు ప్రయాణికుల కుటుంబాలు కూడా శోకసంద్రంలో మునుగుతాయి. డ్రైవర్లు మద్యం సేవించవద్దు, సెల్ ఫోన్‌లో అస్సలు మాట్లాడవద్దు అని ఎంత మొత్తుకున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్‌లో వున్నప్పుడు ఫోన్ వస్తే వాహనాన్ని పక్కకు నిలుపుకుని మాట్లాడుకుని వెళ్లిపోతే సరిపోతుంది. కానీ కొందరు ఆ పని చేయరు. ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసేద్దామని చేసేస్తున్నారు. దీంతో ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టే అవుతోంది. తాజాగా ఓ బస్ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ కెమెరాకు చిక్కాడు.

అతను ఫోన్‌లో వ్యాపార యవ్వారాలు మాట్లాడుతున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నల్లగొండ వెళ్లే నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఏపీ 21 జడ్‌ 208 ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌ మైసయ్య ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. బస్సులో ప్రయాణికులు వున్నారు.. వాళ్లందరి ప్రాణాల బాధ్యత తనదే అన్న విషయాన్ని మరిచిన మైసయ్య ఫోన్ మోగగానే ఎంచక్కా మట్లాడేస్తున్నాడు. మొబైల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గురించి చర్చిస్తూ.. బస్సు నడుపుతున్నాడు.

మైసయ్య వైఖరికి బస్సులో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. ఓ ప్రయాణికుడు ఈ యవ్వారాన్ని అంతా వీడియో తీయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. మైసయ్య ప్రవర్తన పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ప్రకారం బైక్‌ నడుపుతూ.. మొబైల్‌ ఫోన్‌ మాట్లాడితే.. రూ. 2 వేలు జరిమానా విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. మరి ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ఎంత ఫైన్ విధిస్తారో చూడాలి అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటనపై నార్కట్‌ పల్లి డిపో మేనేజర్‌ ఇంకా స్పందించలేదు.

Updated : 9 Sep 2019 5:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top