ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మూడు రోజులుగా చేస్తున్న దీక్షను ఈ రోజు సాయంత్రం ఎట్టకేలకు విమరమించారు. అరెస్ట్ తర్వాత కూడా ఉస్మానియా ఆస్పత్రిలో నిరశనకు దిగిన ఆయనకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మాదిగ దండోరా నేత మంద కృష్ణ మాదిగ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
గృహనిర్బంధంలోనే దీక్ష మొదలుపెట్టిన అశ్వత్థామరెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడా ఆయన దీక్ష సాగించారు. ఆరోగ్యం దెబ్బతిందని వైద్యులు చెప్పినా పట్టించుకోలేదు. ఈరోజు సమ్మెపై హైకోర్టు విచారణ ముగించి, పరిష్కారం చూపాలని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశించడంతో ఆయన దీక్ష ముగించారు. కాగా, రేపు(మంగళవారం) నిర్వహించతలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సమ్మెపై తదుపరి కార్యాచరణను రేపు సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. అయితే నిరసన దీక్షలు మాత్రం కొనసాగుతాయని అన్నారు.