ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ మార్క్ పరిష్కారం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ మార్క్ పరిష్కారం..

December 1, 2019

‘కట్టె ఇరగదు పాము సావదు’ ఈ సామెత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్మకులకు మధ్య నెలకొన్న ఆర్టీసీ సమస్యకు కరెక్టుగా సరిపోతుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని 55 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లలో లేవనెత్తిన 21 అంశాలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వారి సమ్మె అప్రజాస్వామికం అని అన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులలో అనేక అనుమానాలు నాటుకున్నాయి. ఆర్టీసీని ప్రైవేటకు అప్పగిస్తారని,  కార్మికుల పొట్ట కొడతారని అనుకున్నారు. తొలుత నుంచి కేసీఆర్ కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో కేసీఆర్ వారిని చర్చలకు ఆహ్వానించారు.

Pragathi Bhavan.

ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. వారిని ఉద్యోగులు అనే పిలవాలని.. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారని తెలిపారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబంలాగా వ్యవహరించాలని అన్నారు. 

ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. అవసరమైన పక్షంలో  రోజుకు గంటో , అరగంటో ఎక్కువ పనిచేయాలని కోరగా.. కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు. 

అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘సమిష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్పూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలి. నేను రవాణాశాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించాను. నేటికీ నాకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉంది. ఆర్టీసీని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తాం. ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలి. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. రూట్లను రీ సర్వే చేయాలి. ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాను. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా  ప్రతీ నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకు ఒకసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలి. రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలి. సింగరేణి కార్మికుల మాదిరిగా ప్రతీ ఏటా బోనస్‌లు అందుకునే పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులకు రావాలి’ అని కేసీఆర్ ఆకాంక్షించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన నిర్ణయాలు ఇలా.. 

-ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం

-సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.

-వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లు కేటాయిస్తాం. 

-ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును  58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.

-ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది.

-సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము. 

-కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు. 

-మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.

-ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.

-మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం. 

-మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.

-మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.

-రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు.

-ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం.

-ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి.

-ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.

-ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి.

-ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్‌మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 

-ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను, సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.

-డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్‌ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.

-ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం.

-ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. 

-ఆర్టీసీలో పార్శిల్ సర్వీసులను ప్రారంభించాలి. 

కాగా, సమావేశం మధ్యలో కేసీఆర్ పశువైద్యాధికారిణి హత్యాచారం గురించి ప్రస్తావించారు. దారణమైన, అమానుష ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మృగాలు మనమధ్యే తిరుగుతున్నాయని తెలిపారు.