డ్రైవింగ్ టెస్టుకు షార్ట్స్, జీన్స్‌లో రావొద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవింగ్ టెస్టుకు షార్ట్స్, జీన్స్‌లో రావొద్దు..

October 23, 2019

Driving License......

జీన్స్ వేసుకుని డ్రైవింగ్ టెస్టుకు వెళ్లిన ఓ యువతిని అధికారులు తిరిగి ఇంటికి పంపించారు. మంచి డ్రెస్ వేసుకుని రావాలని చెప్పారు. ఇకనుంచి ఎవరైనా సరే డ్రైవింగ్ టెస్టుకు వస్తే జీన్స్, పొట్టి గౌనులు, షార్ట్స్ వేసుకుని రావద్దని చెన్నైలోని కేకే నగర్‌ ఆర్టీవో అధికారులు స్పష్టంచేశారు. ఓ మహిళ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుని టెస్ట్‌ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లింది. అప్పుడు ఆమె ఒంటిమీద జీన్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి వుంది. ఆమెను అలా చూడగానే అధికారులు తక్షణమే ఆమెను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. సరైన దుస్తులు ధరిస్తే కానీ టెస్ట్‌కు అంగీకరించేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో సదరు యువతి షాక్ అయింది. 

మరో మహిళ కూడా పొట్టి లంగా వేసుకుని టెస్ట్‌ కోసం వస్తే ఆమెను కూడా అదే కారణంతో నిరాకరించారు. కేవలం మహిళలను మాత్రమే కాకుండా మగవారు కూడా లుంగీ, షార్ట్‌ వంటి వాటిలో టెస్ట్‌ కోసం వస్తే వారిని కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నట్లు ఆర్టీవో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు డ్రైవింగ్‌ టెస్ట్‌ దరఖాస్తుదారులకు ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ లేకపోయినప్పటికీ.. సరైన దుస్తులు వేసుకుంటేనే డ్రైవింగ్‌ టెస్ట్‌కు అనుమతిస్తామని అంటున్నారు. అదేంటని అడిగినవారికి అధికారులు ధీటుగా సమాధానం చెబుతున్నారు.  డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసే కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం అని.. ఇక్కడకు వచ్చేవారిని సరైన దుస్తులు ధరించాలని కోరడంలో తప్పేం ఉందని ఆర్టీవో అధికారి ప్రశ్నించారు. కాగా, ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2018 నుంచి కేకే నగర్‌ ఆర్టీవో కార్యాలయం మీద ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి.