తన పర్సనల్, వృత్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సమంత రూమర్ల విషయంలో కూడా టాప్‌లోనే ఉంటుంది. ఇటీవలే అనారోగ్యానికి గురై పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగుల్లో పాల్గొనడానికి సిద్ధమైంది. ఇప్పటికే తెలుగులో యశోద, శాకుంతలం సినిమాలను పూర్తి చేసిన సామ్.. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి చేస్తున్న సిటడెల్ సిరీస్ చిత్రీకరణలో త్వరలో పాల్గొనబోతోందని నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమంత హైదరాబాద్ నుంచి చెక్కేసి పూర్తిగా ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా రూ. 15 కోట్లతో మూడు పడక గదులున్న ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది.
తెలుగులో చాలా సినిమాలు చేసిన సామ్.. ఇక ఇక్కడ ఛాలెంజింగ్ పాత్రలు రావని డిసైడ్ అయ్యి బాలీవుడ్‌కి వెళ్లిపోతుందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే ఓ హాలీవుడ్ సినిమా కూడా ఒప్పుకుందని, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ అనే వ్యక్తి దర్శకుడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా ప్రచారంలో ఉన్న విషయాలే కానీ సమంత నుంచి కానీ, ఆమె మేనేజర్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో హిందీలో చేసిన ఫ్యామిలీ మాన్ సిరీస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో జాతీయ స్థాయిలో పేరు రావడంతో అప్పుడే ముంబై వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ దాన్ని ఖండిస్తూ హైదరాబాద్ తనకు సొంత ఇల్లు లాంటిదని సమంత అధికారికంగా ప్రకటించడంతో ఆ రూమర్లు తగ్గాయి. తర్వాత పుష్ప ఐటెం సాంగుతో మరోసారి పాపులర్ కావడం, వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమా ఆఫర్‌తో ఈ సారి కచ్చితంగా హైదరాబాద్‌కు వీడ్కోలు చెప్తుందని అంటున్నారు. మరి ఈ వార్తలపై సమంత రియాక్షన్ ఏంటనేది వేచి చూడాల్సి ఉంది.