Runaway groom..chase and catch the bride..video viral
mictv telugu

పరారైన పెళ్లికొడుకు..ఛేజ్ చేసి పట్టుకున్న పెళ్లికూతురు..వీడియో వైరల్

August 30, 2022

‘నాకు ఈ పెళ్లి వద్దు బాబాయ్’ అంటూ రోడ్డుపై పరుగులు తీసిన వరుడిని, వెంటపడి, వెంబడించి అతడిని వధువు పట్టుకున్న సంఘటన బిహార్‌ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వరుడు చేసిన పనికి, వధువు సినిమా స్టైల్‌లో పట్టుకొని, పోలీసు స్టేషన్‌కు తరలించింది. వీడియోను వీక్షిస్తున్న వారందరు మొదటగా పడి పడి నవ్వుకున్న, ఆ తర్వాత ఆ యువకుడిని పెళ్లి చేసుకోవటం కోసం ఆ యువతి పడిన ఆరాటంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..బిహార్‌ రాష్ట్రం నవాడా ప్రాంతంలోని భగత్‌ సింగ్‌ చౌక్‌‌లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి ఓ యువతితో మూడు నెలల క్రితం  ఇరుకుటుంబాల పెద్దలు వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్‌ కూడా ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడి ఇంటికి వెళ్లగా, అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.

దాంతో శివంగిలా మారిన వధువు.. అతడిని వెంబడించింది. తగ్గేదేలే అంటూ ఛేజింగ్‌ చేసి, మరీ పట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయినా, ఒప్పుకోకపోవటంతో వరుడిని పోలీసు స్టేషన్‌కు తరలించింది. ఇరువురికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు..చివరకు వధువును పెళ్లి చేసుకునేందుకు అతడిని ఒప్పించారు. అనంతరం ఆ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ గుడిలో ఇద్దరికి వివాహం జరిపించారు.