ఇప్పటివరకూ డెబిట్ కార్డులను యూపీఐ(యూనిఫైడ్ పేమంట్ ఇంటర్ఫేస్)లకు అనుసంధానం చేసి డిజిటల్ చెల్లింపులు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్ నాటి పాలసీ సమీక్షలో క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ దిశగా పని చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. మరి క్రెడిట్ కార్డులతో చేసే యూపీఐ చెల్లింపులకు కూడా ఇదే వర్తిస్తుందా? అనే అనుమానం తలెత్తింది. అదే జరిగితే ‘క్రెడిట్ ప్రొడక్ట్’ అయిన క్రెడిట్ కార్డుపై వచ్చే లాభదాయకతపై ప్రభావం పడుతుందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికోసం ప్రత్యేక కమర్షియల్ మోడల్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్యాంకు వర్గాలు డిమాండ్ చేశాయి.
దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. క్యూఆర్ కోడ్ యాక్సప్టెన్సీ నెట్‌వర్క్‌పై రూపే క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ల అనుమతి కోసం ఎన్పీసీఐ ఇప్పటి బ్యాంకులతో మాట్లాడుతోంది. చిరు వ్యాపారులకు కార్డు యాక్సప్టెన్సీ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. ఇది 2 శాతం వరకు ఉండొచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వ్యాపారులు రెండు శాతం ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్సీపీఐ నిర్ణయించినట్లు సమాచారం. దీంట్లో 1.5 శాతం కార్డు జారీ సంస్థలకు వెళ్లనుండగా.. మిగిలిన 0.5 శాతం ఛార్జీ పాయింట్ ఆఫ్ సేల్ సదుపాయం కల్పిస్తున్న సంస్థలు- ఉదాహరణకు పేటీఎం, ఎంస్వైప్కు వెళ్లనుంది. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల వరకు మాత్రమే ఉన్న వ్యాపార కేంద్రాల వద్ద రూ.2,000-5,000 విలువ చేసే లావాదేవీలకు మాత్రం ఎలాంటి ఎండీఆర్ ఉండదు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆర్బీఐకి పంపనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు మూడోవారం నుంచి యూపీఐ-క్రెడిట్‌కార్డు చెల్లింపులు ప్రారంభం కావొచ్చునని అంచనా వేశాయి
ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి నేరుగా చెల్లింపులు చేయొచ్చు. అంటే మీరు ఏమైనా కొనుగోలు చేస్తే.. యూపీఐ యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు చెల్లించొచ్చు.