రష్యా ఇచ్చిన దెబ్బకి భయంతో వణికిపోతున్న యూరప్
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం విషయంలో అమెరికా సమా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆర్ధిక, సైనిక, వ్యాపార ఆంక్షలతో రష్యా ఆర్ధిక వ్యవస్థ కొంత దెబ్బతిన్నది. కనీసం రుణాలు చెల్లించడానికి కూడా అవకాశం లేకుండా రష్యాను కట్టడి చేశాయి. అయితే ఇలాంటి చర్యలతో రష్యా ఏమాత్రం దిగి రాకపోగా, భారత్ వంటి దేశాల సహాయంలో చమురు అమ్మకాలు చేసి డబ్బులు జమ కట్టుకుంది. ఇదంతా గతం కాగా, తాజాగా రష్యా తనపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతోంది. ముఖ్యంగా యూరప్ ఖండంలోని దేశాలకు సరఫరా చేసే గ్యాస్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది.
సాంకేతిక కారణాల వల్ల కేవలం 20 శాతం గ్యాస్ మాత్రమే సరఫరా చేస్తామని రష్యన్ ఎనర్జీ దిగ్గజం గాజ్ ప్రోమ్ వెల్లడించినట్టు బీబీసీ, రాయిటర్స్‌లు కథనం రాశాయి. దీని వల్ల జర్మనీ, ఇటలీ వంటి దేశాలకు పెనుముప్పు తప్పదంటూ హెచ్చరించాయి. తర్వాతి స్థానాల్లో బెలారస్, టర్కీ, నెదర్లాండ్స్, హంగేరీ, కజకిస్తాన్, బల్టేరియా, డెన్మార్క్, ఫిన్లాండ్, పోలాండ్‌లు ఉన్నాయి. మనకు ఎండాకాలంలో ఏసీ ఎలా పెట్టుకుంటామో, యూరప్ దేశాలు చలికాలంలో గ్యాస్ ద్వారా గదిలో వేడిని పెట్టుకుంటారు. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాకపోవడంతో ఆయా దేశాల ప్రజలు చలికి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. అటు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రష్యా స్థానంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి అమెరికా గ్యాస్ సరఫరా చేస్తున్నా.. ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాముంది. దీంతో సమయం చూసి రష్యా దెబ్బకొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.