ఉక్రెయిన్ మేయర్‌ను విడుదల చేసిన రష్యా - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్ మేయర్‌ను విడుదల చేసిన రష్యా

March 17, 2022

gnbgnb

ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశపు బలగాలు గతకొన్ని రోజులుగా భీకరమైన దాడులు చేస్తూనే ఉన్నాయి. ఓవైపు యుద్దం విషయంలో ఇరుదేశాలు చర్చలు జరుపుతూనే, మరోవైపు భయంకరంగా యుద్ధం చేస్తున్నాయి. ఈ సందర్భంగా గతవారం ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్‌ను రష్యా బలగాలు కిడ్నాప్ చేశాయి. దీంతో ఉక్రెయిన్‌లో కలకలం రేగింది. కిడ్నాప్ చేసి ఆయనను తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ద్నిప్రోరుడ్నే నగర మేయర్‌ను సైతం రష్యా సైనికులు కిడ్నాప్ చేశాయి.

అయితే, గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌ను రష్యా బలగాలు విడుదల చేశాయి. దీనికి బదులుగా తమ వద్ద బందీలుగా ఉన్న తొమ్మిది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ బలగాలు విడుదల చేశాయి.

విడుదలైన రష్యా సైనికులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. పౌరులు కచ్చితంగా సైన్యంలో పని చేయాలనే నిబంధన కింద వీరు రష్యా సైన్యంలో నియమితులయ్యారు. వీరంతా 2002-03 మధ్యలో జన్మించారని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు ఇలాంటి వారిని ఉక్రెయిన్‌లో విధులకు పంపలేదని యుద్ధం తొలినాళ్లలో రష్యా తెలిపింది.