ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలై ఏడాది కావస్తున్నా పూర్తిస్థాయి విజయం దక్కకపోవడంతో రష్యా ఉక్రోషంలో ఉంది. పాశ్చాత్య దేశాలు చేస్తున్న సాయం పట్ల పుతిన్ కోపంగా ఉన్నారు. పుతిన్‌ని మరింత రెచ్చగొట్టేలా ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీవ్ వెళ్లి 500 మిలియన్ డాలర్ల మిలటరీ సాయాన్ని ప్రకటించడంతో పరిస్థితి మరింత ముదురుతోంది. దెబ్బకు దెబ్బ అన్న భావనలో ఉన్న రష్యా తాజాగా భీకర ఖండాంతర క్షిపణిని పరీక్షించింది.
ఈ విషయాన్ని అమెరికాకు వివిధ మార్గాల ద్వారా ముందే తెలియజేసి జాగ్రత్తపడింది రష్యా. అత్యంత భారీ క్షిపణిగా పేరున్న సర్మత్ (సాటన్ -2) పరీక్షలో ఫెయిలయిందని అమెరికా అంటోంది. కానీ రష్యా మాత్రం ఏ విధమైన ప్రకటన చేయలేదు. గంటకు 25 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ క్షిపణి పొడవు 36 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు, బరువు 200 టన్నులుగా ఉంది.
ఒకేసారి 16 అణు వార్ హెడ్‌లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉంది. అంతేకాక ఒకే సమయంలో 16 టార్గెట్‌లకు గురి పెట్టవచ్చు. భూమ్మీద ఏ టార్గెట్‌ని అయినా ఛేదించే కెపాసిటీ తమకు ఉందని గతంలో సర్మత్ విషయంలో రష్యా తెలిపింది. దీని ద్వారా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మొత్తాన్ని తుడిచిపెట్టేయవచ్చని విశ్లేషకులు చెప్తున్న మాట. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి రష్యాలో పర్యటిస్తున్నారు. యుద్ధాన్ని మరింత ప్రభావవంతంగా చేయాలని సంకల్పించిన పుతిన్.. అందుకు చైనా నుంచి ఆయుధ సాయం కోరుతున్నాడని అమెరికా ఆరోపిస్తోంది. ఇదే నిజమైతే ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రష్యాను హెచ్చరించింది.