ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం ఎందుకు? ఏం జరుగుతోంది? - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఎందుకు? ఏం జరుగుతోంది?

February 24, 2022

 

nhn

ఒకప్పుడు తనలో భాగంగా ఉండి, 30 ఏళ్ల కిందట స్వతంత్ర ప్రకటనతో విడిపోయిన ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెగబడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలుచోట్ల సైనిక స్థావరాలపై దాడి చేసింది. 300 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా విలయం, దాని ఫలితంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టడానికి ప్రపంచ దేశాలు తిప్పలు పడుతోంటే రష్యా మాత్రం మరో పనేమీ లేనట్లు పక్క దేశంపై ఎందుకు బాంబులు వేస్తోంది? యుద్ధం వద్దు వద్దు అని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? స్వతంత్రంగా నిలదొక్కకునే దారిలో అగ్ర రాజ్యాల మధ్య చిక్కుకుపోయిన ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంత గతంలోకి, సమీప గతంలోకి వెళ్లక తప్పదు..


నాటో వల్లే..
1991లో సోవియట్ రష్యా కుప్పకూలక బెలారస్, అజర్‌బైజాన్, ఎస్తోనియా, లాత్వియా లిథువేనియా తజకిస్తాన్ తదితర ప్రాంతాలతోపాటు ఉక్రెయిన్ కూడా స్వతంత్ర దేశంగా అవతరించింది. అంతవరకూ సోవియట్ రష్యా, అమెరికాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం కూడా రూపు మార్చుకుంది. రష్యా నుంచి రక్షణ కోసం లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాలు అమెరికా సారథ్యంలోని ‘నాటో’(ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి)లో చేరాయి. ఉక్రెయిన్, జార్జియా దేశాలు కూడా అందులో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. తన మాజీ దేశాల్నీ నాటో గూటికింద చేరితే తన భద్రతకు విఘాతం కలుగుతుందని రష్యా భయపడుతోంది. సామదానాభేదదండోపాయాలతో ఇప్పటికే ఆసియాలోని చాలా దేశాల్లో తిష్టవేసిన నాటో బలోపేతమైతే తనకు ముప్పే అని ఆందోళన చెందుతోంది. అందుకే ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవద్దని ఆ కూటమిలోని దేశాలను హెచ్చరిస్తోంది.


ఉక్రెయిన్ తడబాట్లు
పక్కలో బల్లెంలా ఉన్న రష్యాతో సంబంధాల విషయంలో ఉక్రెయిన్ పాలకలు తొలి నుంచీ తప్పటడుగులు వేస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న వ్యూహంతో అమెరికాకు, నాటోకు దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలు గమ్యం లేక బెడిసికొడుతున్నాయి. 1990 దశకం రెండో అర్థభాగంలో దేశంలో అసమానతలు పెరిగి సంపద పిడికెడు మంది చేతుల్లో చిక్కుకుపోయింది. అవినీతి, నేర రాజకీయాలు కూడా దేశాన్ని గాడి తప్పించాయి. కొన్నిసార్లు రష్యాతో, కొన్నిసార్లు అమెరికా, యూరప్ యూనియన్‌లతో స్నేహం చెయ్యడం పరిపాటిగా మారింది. నాటో, ఉక్రెయిన్ స్నేహాన్ని జీర్ణించుకోని రష్యా 2009లో ఆ దేశానికి గ్యాస్ సరఫరా నిలిపేసింది. యూరప్ దేశాలకు ఆ గ్యాస్ పైప్ లైన్ కీలకం. అవి ఆందోళనతో చెందడంతో రష్యా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఈ నేపథ్యంలో 2010లో పుతిన్‌ మిత్రుడైన విక్టర్‌ యాన్కోవిచ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి, తమ దేశం తటస్థ దేశంగా ఉంటుందని ప్రకటించాడు. రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. వందలమంది చనిపోయారు. యాన్కోవిచ్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గలేక రష్యాకు పారిపోయాడు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాసో ప్రాంతంలో ఘర్షణలు జరిగాయి. 2014లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతుతో పెట్రో పొరొషెంకో ఉక్రెయిన్ గద్దెనెక్కాడు. అయినా డాన్‌బాసోలో అల్లర్లు ఆగలేదు. వీటి వెనక రష్యా హస్తముందని ఉక్రెయిన్ ఆరోపణ. అదంతా అసత్యమని రష్యా కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై జరిగిన సైబర్ దాడుల వెనక రష్యా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నాటోనే తమకు శరణ్యమని ఉక్రెయిన్ భావిస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరకుండా రష్యా ఆటంకాలు సృష్టిస్తోంది. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దులో రష్యా సైనిక విన్యాసాలు పెరుగుతున్నాయి. బలప్రదర్శన ఆపాలని పశ్చిమ దేశాలు రష్యాను కోరుతున్నాయి. నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకోబోమని తమకు రాతపూర్వక హామీ కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాను డిమాండ్ చేశారు. అందుకు అమెరికా నో అంది. అంతేకాకుండా గత నెల నాటో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తూర్పు యూరప్ చేరుకున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ఉదయం రష్యా వాయుసేన బాంబు దాడులకు దిగింది.
భవిష్యత్ ఏమిటి?


రష్యా పూర్తిస్థాయి యుద్ధం చేసే అవకాశం లేదని రక్షణ, రాజకీయ నిపుణుల అంచనా. నాటోకు దగ్గరైతే పరిస్థితి భయానకంగా ఉంటుందని హెచ్చరించడానికే పుతిన్ సైనిక చర్యకు పిలుపు ఇచ్చాడని, పాశ్చాత్య దేశాల ఒత్తిడితో వెనక్కి తగ్గొచ్చని అంచనా. అయితే ఉక్రెయిన్ పరిస్థితిలో మార్పు ఉండదని, ఆ దేశం నిత్యం రష్యా భయంతో బిక్కుబిక్కుమని గడపాల్సి వస్తుందని, పుతిన్‌తో స్నేహంగా ఉండటమే పరిష్కారమని కొందరు అంటున్నారు.