రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య ఐదు రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం విషయంలో సోమవారం చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కొద్దిసెపటి క్రితమే చర్చలు ముగిశాయి. కానీ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదరకపోవటంతో చర్చలు విఫలం అయ్యాయి. బెలారస్ కేంద్రంగా మొదలైన చర్చలు ఏకంగా 3 గంటల పాటు కొనసాగాయి. ఈ భేటీలో ఇరు దేశాల విదేశాంగ శాఖలకు చెందిన ప్రతినిధి బృందాలు పాలుపంచుకున్నాయి.
అంతేకాకుండా రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బెలారస్లో చర్చలకు తాము వ్యతిరేకమంటూ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్చలకు తొలుత రష్యానే ప్రతిపాదన చేయగా.. అందుకు అంగీకరించిన జెలెన్స్కీ చర్చలను బెలారస్లో కాకుండా తటస్థ వేదికపై జరిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు. అయితే, రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో పరిస్థితి నానాటికీ విషమిస్తున్న నేపథ్యంలో బెలారస్‌లోనే చర్చలకు జెలెన్స్కీ అంగీకరించారు. 3 గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు.
మరోపక్క రష్యా 36 దేశాలకు చెందిన విమానాలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా యూరోపియన్ యూనియన్ దేశాలు..రష్యా విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే.