అమెరికా, రష్యాల మధ్య వైరం పెరుగుతోంది. అమెరికా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం, రష్యా మీద ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గగనతలంలో ఉన్న అమెరికా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
నల్ల సముద్రం మీద అంతర్జాతీయ ఎయిర్ స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్యూ-27 ఫైటర్ జెట్లు విన్యాసాలు చేశాయి. అలా చేస్తున్నప్పుడు ఎటువంటి రక్షణ కూడా అవి తీసుకోలేదు. అందులోని ఒక జెట్ అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్ ను ఢీకొట్టింది. దీంతో యూఎస్ తమ డ్రోన్ వెంటనే కిందకు దించేసింది. ఈ సంఘటన గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు ప్రెసిడెంట్ జో బైడెన్‌కు సమాచారం అందించారు.
రష్యా చేసిన ఈ పని మీద అమెరికా మండి పడుతోంది. ఈ సంఘటన రష్యా నిర్లక్ష్యాన్ని , లెక్కలేనితనాన్ని ప్రూవ్ చేస్తోందని ఆరోపించింది. అయితే దీని మీద తామేమీ వెంటనే చర్యలు తీసుకోవడం లేదని అమెరికా చెబుతోంది. ఇరుదేశాలకు సంబంధించిన డిప్లోమాట్స్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అంటోంది.