నోబెల్ వేలం.. ఉక్రెయిన్ చిన్నారులకు రష్యన్ జర్నలిస్ట్ చేయూత - MicTv.in - Telugu News
mictv telugu

నోబెల్ వేలం.. ఉక్రెయిన్ చిన్నారులకు రష్యన్ జర్నలిస్ట్ చేయూత

June 21, 2022

ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యన్‌ జర్నలిస్ట్‌ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్‌ బహుమతిని విక్రయించారు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది. రష్యా కు చెందిన డిమిత్రి ఉక్రెయిన్ చిన్నారుల కోసం ఈ విధమైన సాయం చేయడం సాహసమని చెబుతున్నారు కొందరు. డిమిత్రి 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, సుస్థిర శాంతి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు చేసిన కృషికి ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

ఈ మేరకు డిమిత్రి మురాటోవ్‌ తన నోబెల్‌ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఊహించని రీతిలో ఆయన సాధించిన బహుమతి వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర (103 మిలియన్ డాలర్స్)పలికింది. హెరిటేజ్‌ వేలం కంపెనీ ఈ నోబెల్‌ ప్రైజ్‌ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్‌ అందజేస్తామని స్పష్టం చేసింది.

రష్యా అధ్యక్షుడి పుతిన్‌ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది.