రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితురాలైన ఆ దేశ రక్షణ శాఖ కీలక అధికారిణి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఓ అపార్టుమెంటులోని 16వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. రక్షణశాఖలో ఆర్థిక సహాయ విభాగానికి సారథ్యం వహిస్తున్న మరీనా యాంకినా (58) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓ భవనంలో 16వ అంతస్తు నుంచి కింద పడింది. రోడ్డుపక్కన పేవ్ మెంట్ మీద ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం చురుగ్గా నిధులు సేకరిస్తున్న మరీనా తన భర్త ఇంట్లోని కిటికీ నుంచి కిందపడి చనిపోయారు. ఆమె అక్కడ నివసించడం లేదని, ఏదో పనిపై అక్కడికి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పలువురు కీలక రష్యన్ అధికారులు అనుమానాస్పదంగా చనిపోవడంతో మరీనా మృతి వెనక కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఆర్మీ నుంచి ఉద్వాసనకు గురైన మేజర్ జనరల్ వ్లాదిమిర్ మకరోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే పార్లమెంటు సభ్యుడు, వ్యాపారి పావెల్ ఆంటోన్ ఒడిశాలోని రాయగఢ సిటీలో ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అంతకు రెండు రోజుల ముందు పావెల్ స్నేహితుడు వ్లాదిమర్ బెడెనోవ్ కూడా అలాగే చనిపోయాడు. ఈ మరణాల వెనక రష్యన్ అధికారుల కుట్రగాని, థర్డ్ పార్టీ క్రిమినళ్ల హస్తం గాని ఉండొచ్చని భావిస్తున్నారు.