భారత పర్యటనకు వచ్చిన నలుగురు రష్యన్ టూరిస్టులు ఒడిషాలోని రాయగడలోని ఓ హోటల్ లో బస చేశారు. అందులో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోయారు. వీరిలో ఒకరు రష్యన్ చట్టసభకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి (ఇక్కడి ఎమ్మెల్యేలాగా) ఉండడం గమనార్హం. దీనిపై స్పందించిన దేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం.. తమ దేశ పౌరుల మరణాల వెనుక ఎలాంటి నేరపూరిత సంబంధాన్ని పోలీసులు కనుగొనలేదని పేర్కొంది. చనిపోయిన వారిలో ఒకరైన పావెల్ అనతోవ్.. ఇటీవల రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.
వ్లాదిమిర్ ఒబ్లాస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే పావెల్ అనతోవ్.. శనివారం రాయగడ హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి చనిపోగా, రెండ్రోజుల తర్వాత తోటి ప్రయాణీకుడు వ్లాదిమిర్ బిడెనోవ్ అదే హోటల్ లో శవమై కనిపించాడు. అతని చుట్టూ ఖాళీ వైన్ సీసాలు ఉన్నట్టు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఇక మిగిలిన ఇద్దరు టూరిస్టులను అక్కడే ఉండి దర్యాప్తుకు సహకరించమని రష్యన్ ఎంబసీ కోరింది. కాగా, పుతిన్ ని విమర్శించే ప్రతిపక్ష నేతలపై గతంలో విష ప్రయోగం చేసి చంపేసేవారు. దీంతో పావెల్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.