రష్యా ప్రధాని సహా కెబినెట్ రాజీనామా.. కారణం ఇదేనా..? - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా ప్రధాని సహా కెబినెట్ రాజీనామా.. కారణం ఇదేనా..?

January 16, 2020

Russian PM.

రష్యా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చినట్టు స్థానిక న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఆయనతో పాటు పూర్తి కేబినెట్ కూడా వైదొలిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దీంతో త్వరలోనే కొత్త కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. 

ప్రధాని, కెబినెట్ మంత్రులకు అధికారాలను పెంచాలనే ప్రతిపాధనను ఇటీవల పుతిన్ తెరపైకి తెచ్చారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక సవరణలను ప్రతిపాధించారు. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు అధ్యక్షుడికి గరిష్టంగా ఉన్న అధికారాలు ప్రధాని, కెబినెట్ చేతులకు వెళ్తాయి. అధికారాలు అక్కడి పార్లమెంట్‌కు కట్టబెట్టడమే ఈ సవరణలోని ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. దీని ద్వారా పరిపాలన విభాగాన్ని బలోపేతం చేయాలని పుతిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

మెద్వదేవ్ 2012 నుంచి ఆయన రష్యా ప్రధాన మంత్రి పదవిలో ఉన్నారు. పుతినత్‌కు ఈయన ఎంతో సన్నిహితుడు కావడం విశేషం. అలాంటి ఆయన రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది.  2008-12 మధ్య మెద్వదేవ్ అధ్యక్షుడిగా ఉండగా.. ఆ సమయంలో పుతిన్ రష్యా ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి పుతిన్ ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో విశేషం ఏంటంటే 2024లో పుతిన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతారు. ఆ తర్వాత తనకోసం ఓ పదవిని సృష్టించుకోవడం కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.  స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన వ్యక్తి పుతినే కావడం విశేషం.