Russian President Putin once again praised India
mictv telugu

భారతీయులు వెరీ టాలెంటెడ్.. మరోసారి పుతిన్ ప్రశంసల వర్షం

November 5, 2022

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారతీయులు, భారత దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు చాలా ప్రతిభావంతులని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలు సాధించే సత్తా ఉన్నవారని కొనియాడారు. ‘భారత్‌ని చూడండి. దేశ అభివృద్ధి కోసం పనిచేసే ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. 150 కోట్ల జనాభాతో అత్యంత సమర్ధవంతమైన దేశంగా భారత్ నేడు ఉంది. కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహాలు లేవు’ అని వెల్లడించారు. శుక్రవారం రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విధంగా మాట్లాడారు.

గతవారం కూడా పుతిన్ మన దేశాన్ని పొగిడారు. ప్రధాని మోదీ స్వతంత్ర విదేశాంగ విధానంతో మరింత ముందుకు సాగుతుందని ప్రశంసించారు. మోదీ గొప్ప దేశభక్తుడని, భవిష్యత్తు భారత్‌దేనని అభివర్ణించారు. ఇదిలా ఉంటే విదేశాంగ మంత్రి జై శంకర్ నవంబర్ 7, 8 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ద్వైపాక్షిక భేటీలో ఆర్ధిక సహకారంపై చర్చించనున్నారు. కాగా, పాశ్చాత్య దేశాల ఒత్తిడిని కాదని తక్కువ ధరలో వస్తున్న రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం తెలిసిందే.