యుద్ధాన్ని ముగిద్దాం అనుకుంటున్నా. మొత్తానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నోటి నుంచి ముగింపు అనే మాట వచ్చింది. దాదాపు పది నెలలుగా సాగుతున్న మారణకాండ ఓ ఎండ్ కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఉక్రెయిన్‌పై మాస్కో మొదలుపెట్టిన దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈ 10 నెలల్లో రష్యా పెను విధ్వంసానికి పాల్పడింది. అటు, ఉక్రెయిన్ కూడా రష్యాకు తలవంచలేదు. ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపుపై పుతిన్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుందని, వీలైనంత త్వరగా పోరాటాన్ని ముగిస్తామని పుతిన్ అన్నారు.వివాదాన్ని ముగించడమే మా లక్ష్యం, మేము దీని కోసం ప్రయత్నిస్తున్నాం.. ప్రయత్నిస్తూనే ఉంటాం… త్వరలోనే అంతా ముగిసేలా చూసుకుంటాం అని అన్నారు. ఇది ఎంత త్వరగా అయితే అంత మంచిదని కూడా ఆలోచిస్తామని చెప్పారు. అలాగే, వచ్చే ఏడాది నాటికి సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని, అణ్వాయుధాలను కూడా పెద్దమొత్తంలో అభివృద్ధి చేస్తామని పరోక్షంగా పుతిన్ హెచ్చరించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సమావేశంపై రష్యా స్పందించింది. మా ఆందోళనలను అమెరికా, ఫ్రాన్స్ సహా పశ్చిమ దేశాలు పెడచెవిన పెడుతున్నాయని విమర్శలు గుప్పించింది.యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు తొలిసారి అమెరికాలో అడుగుపెట్టారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీగానీ మా ఆందోళనలను పట్టించుకోవడం లేదు.. కనీసం మా మాట వినడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు అని రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, జెలెన్స్కీ అమెరికాకు వెళ్లడానికి కొన్ని గంటల ముందే దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన సైనిక ఉత్పత్తులను ఉక్రెయిన్‌కు అందించేందుకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. అంతేకాకుండా క్షిపణి దాడులను సైతం తట్టుకునేందుకు వీలుగా పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు అందిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.