Russian private army recruiting prisoners for Ukraine war
mictv telugu

యుద్ధంలోకి రేపిస్టులు, హంతకులు.. రష్యా కొత్త రిక్రూట్‌మెంట్

September 15, 2022

ఉక్రెయిన్‌పై భీకర యుద్ధానికి దిగిన రష్యాకు తలబొప్పి కట్టడంతో ఎన్ని అడ్డదారులు తొక్కయినా సరే పైచేయి సాధించాలని నానా తిప్పలూ పడుతోంది. ఆర్మీతోపాటు ‘చేతి సాయం’ చేసే అన్ని వర్గాల సాయుధులను కలుపుకుపోతున్న మాజీ సోవియట్ దేశం సరికొత్త రిక్రూట్మెంట్‌కు తెరతీసింది. దారుణమైన అత్యాచారాలు, హత్యలు చేసి జైల్లో మగ్గుతున్న నేరస్తులను యుద్ధంలోకి దింపడానికి ప్రయత్నిస్తోంది. వారికి నానా ఆశలూ కల్పించి వార్ జోన్‌లోకి పంపనుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడైన ప్రైవేటు ఆర్మీ ‘వాగ్నర్’ అధిపతి యెవజెనీ ప్రిగోచిన్ ఈ వీడియోలో ఖైదీలనుద్దేశించి ప్రసంగించాడు. ‘ఐదే నిమిషాల్లో నిర్ణయం తీసుకోండి. మీరు యుద్ధంలో ఆరునెలలు మనుగడ సాగించగలిగితే తర్వాత క్షమాభిక్ష పెట్టి వదిలేస్తాం. మీరు ఉక్రెయిన్‌కు పట్టుబడే పరిస్థితి వస్తే బాంబుతో పేల్చుకుని అమరులై చచ్చిపోండి. యుద్ధం నుంచి పారిపోతే మాత్రం కాల్చిపారేస్తాం. ఈ యుద్ధం చాలా కష్టం. మీకు రెండు గ్రెనేడ్లు ఇస్తాం, ఒకటి శత్రువును చంపడానికి, రెండో మీరు చావడానికి. మీరు చచ్చిపోతే యుద్ధవీరులుగా ప్రశంసిస్తూ గౌరవంగా పూడ్చిపెడతాం. యుద్ధంలో మందు, ఆడవాళ్లు పొందు నిషిద్ధం. మీరు నా పేరు వినే వుంటారు, వాగ్నర్ ఆర్మీ వాడిని’ అని ప్రిగోచిన్ చెప్పాడు.