పుతిన్‌కి రష్యా టీవీ చానెల్ షాక్.. లైవ్‌లోనే - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్‌కి రష్యా టీవీ చానెల్ షాక్.. లైవ్‌లోనే

March 5, 2022

రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ దేశంపై యుద్ధం ప్రకటించి, దాదాపు తొమ్మిది రోజులు అవుతుంది. అప్పటి నుంచి నేటిదాకా పుతిన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. యుద్ధం వద్దంటూ రష్యా ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మరోవైపు రష్యాలోని కుబేరులు పుతిన్‌తో సంబంధాలు తెచ్చుకుంటున్నారు. దాడులు వద్దు శాంతే ముద్దు అంటూ పలు దేశాలు రష్యాపై ఆంక్షల పర్వం మొదలెట్టాయి. ఇటువంటి సమయంలో పుతిన్‌కు స్వదేశంలో మరోసారి నిరసన సెగ తగిలింది. రష్యాకు చెందిన టీవీ రెయిన్ (Rain)చానల్ సిబ్బంది లైవ్‌లోనే మూకుమ్మడి రాజీనామాలు చేసిన సంఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ ఆ దేశానికి చెందిన టీవీ రెయిన్‌ చానల్‌ సిబ్బంది రాజీనామా చేశారు. ఓ వైపు లైవ్‌లో న్యూస్‌ రన్‌ అవుతుండగానే వారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. చానల్‌ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో టీవీ ప్రసారాలు చేసి రాజీనామాలు అందించారు. వారి నిర్ణయాన్ని సంస్థ యాజమాన్యం సైతం మద్దతు ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా అంతకు ముందు ‘టీవీ రెయిన్’చానల్ ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం యుద్ధాన్ని ప్రసారం చేసేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ చానల్ ప్రసారాలను రష్యా ప్రభుత్వం నిలిపివేసింది.

మరోవైపు ఛానెల్ ఫౌండర్స్‌లో ఒకరైన నటాలియా సిందెయెవా మాట్లాడుతూ.. ‘యుద్ధం వద్దు అనే ప్రోగ్రాం తర్వాత ఉద్యోగులు రాజీనామాలు ఇచ్చి స్టూడియో నుంచి వెళ్లిపోయాం. అనంతరం మా చానల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నాం’ అని పేర్కొన్నారు.