సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు ఒళ్లు చూపిస్తే కొందరు బలుపు చూపిస్తుంటారు. డబ్బున్నోళ్ల సంగతి చెప్పక్కర్లేదు. వెర్రి వేయి విధాలన్నట్లు అట్రాక్ట్ చేయడమే పని. రష్యాకు చెందిన ఓ యూట్యూబర్ ఇలాంటి వెర్రి స్టంటులో భాగంగా ఖరీదైన కారును ధ్వంసం చేశాడు. కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ. 3 కోట్లుకుపైగా ఖరీదైన లాంబోర్గిని కారును తుక్కుతుక్కు చేశాడు. అతగాడి పేరు మిఖాయిల్ లిత్విన్. యూట్యూబ్‌లో కోటిమందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇలాంటి చేష్టలను వీడియో తీసి సోషల్ పడేయడమే పని. తాజాగా 3.15 కోట్ల ఖరీదైన కారును లిట్ ఎనర్జీ కూల్ డ్రింక్ ప్రచారం కోసం పాడు చేశాడు. ఓ క్రేన్‌కు పెద్ద డమ్మీ కూల్‌డ్రింక్ వేలాడదీసి సరిగ్గ కారుపై పడేయించాడు. సీసాలో ద్రవం ఎర్రగా చెల్లాచెదరై కారు ఎందుకూ పనికిరాకుండాపోయింది. ఈ వీడియోను లక్షల మంది వీక్షిస్తున్నారు. కొందరు కెవ్వు కేక అని మెచ్చుకుంటుంటే కొందరు చెడమడా తిడుతున్నారు. ‘‘అంత ఖరీదైన కారును ధ్వంసం చేయడానికి మనసెలా ఒప్పుంది. దానికి తగలేసిన డబ్బును పేదలకు ఇచ్చివుండాల్సింది. ఎన్నో జీవితాలు బాగుపడవి. వ్యూస్ కోసం రేపు ఇంకెలాంటి ఘాతుకాలు చేస్తాడో, ఏమో,’’ అని తిడుతున్నారు.