ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు లేదు. కొత్త సంవత్సరంతో ఇంకా పరిస్థితులు ఉద్రిక్తతమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రష్యా దాడులను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటుంది. కొత్త సంవత్సరం మొదటి రోజే 40కి పైగా డ్రోన్ లతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కూడా రష్యా ఆక్రమిత డొనెట్క్స్ ప్రాంతంపై క్షిపణి దాడులకు దిగింది. ఈ ఘటనలో 400కుపైగా రష్యన్ సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వర్గాలు తెలిపాయి. మరో 300 మంది వరకు గాయపడినట్లు సమాచారం. ఇక రష్యా చేసిన పని ఉక్రెయిన్‌కు కోపం తెప్పిస్తోంది. డ్రోన్ దాడులకు ఆ దేశానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంపై ఉక్రెయిన్ జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హ్యాపీ న్యూ ఇయర్, బూమ్ అంటూ రాసిన డ్రోన్ పిల్లల ఆడుకునే మైదానంలో పడింది. ఈ విషయాన్ని కీవ్ కు చెందిన ఓ పోలీస్ అధికారి తన ఫేస్ బుక్‌లో పంచుకున్నారు. దీనిపై స్పందించిన జెలెన్ స్కీ.. ఇదొక అతి చేష్టగా అభివర్ణించారు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ దాడులు తీవ్రం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు.