ఉక్రెయిన్‌తో సాగుతున్న పోరుపై రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. శత్రుదేశాలను ఓడించడమే తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యమని అన్నారు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్. నాటో తమపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందని, తాము గనుక నిజంగా అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని అన్నారు.
బహిరంగంగా అంగీకరించకపోయినప్పటికీ పశ్చిమ దేశాలు పరోక్షంగా రష్యాపై యుద్ధం సాగిస్తున్నాయని ఆరోపించారు. శత్రువుపై అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం తమకు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అణు యుద్ధం ప్రపంచ పరిణామాలతోపాటు భూమి వాతావరణాన్నే మార్చేస్తుందని, అది తమకు ఇష్టం లేదని చెప్పారు. బలవంతుడైన శత్రువును ఆర్థిక, సైనికపరమైన మార్గాల ద్వారా, సంప్రదాయ యుద్ధరీతులతోనే ఓడిస్తామని దిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు.