రైతుబంధు నిధుల విడుదల ఎప్పుడో చెప్పేసిన మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

రైతుబంధు నిధుల విడుదల ఎప్పుడో చెప్పేసిన మంత్రి

November 12, 2022

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రెండో విడత రైతుబంధు నిధులకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం వెల్లడించారు. రెండో పంట సాగుకు డిసెంబర్ నెలలో రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలియజేశారు. రైతులు పండించిన ప్రతీ గింజా కొంటామని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.

ఈ సారి జిల్లాలో 1 లక్షా 82 వేల 963 ఎకరాల్లో పంట సాగు చేయగా, 5.24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. గన్నీ బ్యాగుల కొరత లేదని, వడ్లను ఆరబెట్టి తీసుకొస్తే తరుగు సమస్య ఉండదన్నారు. అలాగే యాసంగి సీజన్‌‌కు సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని సూచించారు.