ఏపీలో బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఓ ఎస్సై అడ్డుకున్నారు. అంతేకాదు అమ్మవారికి పూజలు నిర్వహిస్తుండగా గుడిలోని మైకును లాగేసి హల్చల్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో చోటు చేసుకుంది. జయంతి గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం ఎదురుగా మహిళలు అందరూ చేరి భక్తితో బతుకమ్మ ఆట ఆడుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఎస్సై హరిప్రసాద్ మహిళలను బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా పూజ జరుగుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉన్న మైకులు సైతం లాగేసినట్లు స్థానికులు ఆరోపించారు. తనను ఒప్పించడానికి ప్రయత్నించిన గ్రామస్తులను ఎస్సై బెదిరించాడని తెలిపారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన గ్రామస్తులు ఎస్సై ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సంఘటనపై నందిగామ డీఎస్పీ జి.వి.రమణమూర్తి స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమని స్వయంగా తానే విచారిస్తున్నానని అన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మరోపక్క రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి జయంతి గ్రామాన్ని సందర్శించి ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ఇతర మతాల కార్యకలాపాలపై సున్నితమైన వైఖరిని చూపుతున్నారని ఆయన అన్నారు. ‘హిందూ పండుగలు, వేడుకల విషయానికి వస్తే పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఇంత దారుణంగా వ్యవహరించడం సరైనది కాదు. ఇది హిందూ ధర్మానికి అవమానం. అధికారుల పక్షపాత వైఖరిని మేము సహించం’ అని మండిపడ్డారు.