కాళ్లు విరిగిన అభిమానికి ‘సాహో’ లక్ష సాయం
మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో ప్రభాస్ సినిమా ‘సాహో’ సందడి చేయనుంది. ఇప్పటికే ఆయన అభిమానులతో ధియేటర్లు అన్ని కోలాహలంగా మారాయి. ఫ్లెక్సీలు కడుతూ సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే బుధవారం మహబూబ్‌నగర్‌లోని తిరుమల థియేటర్‌లో ఫ్లెక్సీలు కడుతున్న వెంకటేశ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండో అంతస్తు నుంచి కిందపడటంతో అతని కాళ్లు చేతులు విరిగిపోయాయి.
ఈ ఘటనపై సినిమా నిర్మాతలు విక్రమ్ రెడ్డి, వంశీరెడ్డి స్పందించారు. వెంకటేశ్ గాయపడిన విషయాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ద్వారా నిర్మాతలు తెలుసుకున్నారు. వెంటనే నిర్మాతలు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం లక్ష రూపాయలు నగదును వెంకటేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఎవరూ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఫ్లెక్సీలు కట్టే సమయంలో, టపాయకాయలు పేల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.