స్వామియే శరణం! స్వతంత్రతే ఆభరణం!!సమానత్వమే జాతి మనుగడకు మూలం!!! - MicTv.in - Telugu News
mictv telugu

స్వామియే శరణం! స్వతంత్రతే ఆభరణం!!సమానత్వమే జాతి మనుగడకు మూలం!!!

October 22, 2018

ఏ కారణాల వల్లనైనా గాని  ఇప్పుడు శబరిమల ఆలయం చుట్టూ జరుగుతున్న సంఘటనలు అసాధారణమైనవి. మహిళల ఆలయ ప్రవేశం సరే.. అక్కడ జరుగుతున్న సంఘటనలపై వార్తలు సేకరించేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల మీద కూడా  దాడులు జరుగుతున్నాయి. మహిళలు ఆలయం వద్దకు వెళ్లాలి అనుకున్నా.. పోలీసుల బందోబస్తుతో ఆలయ సరిహద్దుల వరకు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. అధికార పార్టీ అయిన సీపీఎం పత్రిక సమావేశాలు పెట్టి విశ్వాసాల మీద చర్చ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ అక్కడి ఆర్ఎస్ఎస్‌తో కలిసి ఆందోళనలు చేస్తోంది. కొచ్చిలో ఓ మహిళా హక్కుల నేత ఇళ్లును ధ్వంసం చేశారు. దశాబ్దాలుగా కేరళ అధికార పీఠం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటి అనుకూలతను చూసుకుంటూ పండగ చేసుకుంటున్నది.

విశ్వాసాల మాట అటుంచి సహజ న్యాయ సూత్రం అనుసరించి మాట్లాడితే… ప్రజలు తమకు ఇష్టం వచ్చిన దేవుడిని కొలిచేందుకు, చూసేందుకు కుల మత భేదాలు, లింగ భేదాలు అడ్డం ఉండకూడదు. (అయ్యప్ప ఆలయంలోకి మహిళలు రావడమంటే పురుషుల టాయిలెట్‌లోకి స్త్రీలు రావడం లాంటిదని ఓ మహానుభావుడు అనడమంటే ఆలయం శౌచాలయం రెండు ఒకటేనా… ఇదేం దరిద్రమైన పోలిక అనే వారు లేక పోలేదు). సుప్రీం కోర్టు లాంటి లీగల్ సంస్థలు దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వటం కూడా సహజమైనదే. మహిళలు ఆలయం మెట్లు ఎక్కకూడదు ఇది సనాచారం కాదు.. అంటే భారత దేశం ఆధునిక దేశం అని చెప్పుకోవడం కూడా కుదరదు.

అయితే వ్యక్తి హక్కులు లేక ఒక సమూహం ఆలోచనలను విశ్వాసాలను కూడా పట్టించుకోవాలి అనే ఆలోచన కూడా రావొచ్చు… రావాలి. ఆధునిక యుగంలో మహిళలు ఎక్కకూడని ప్రదేశాలు ఉంటే అవి గొప్ప సంకేతాలేమి కావు. కానీ ఇది భక్తులకు సంబంధించిన విశ్వాసాలకు లేదా ఆచారాలకు ముడి పెట్టి ఒక సంక్లిష్టమైన అంశంగా మార్చివేయడం ఇప్పటి విషాదం. ఈ విశ్వాసాల్ని సదా కాపాడటం కుదరదని సుప్రీం కోర్టు అనడం అంటే ఏది మంచి విశ్వాసమో కోర్టులు ప్రజలకు చెప్పేంత వరకు వెళ్లొచ్చునా? అయితే మరి మసీదులకు ఇంకో మతానికి చెందిన ప్రార్ధనా మందిరాలకు ఎందుకు వర్తింపచేయరు? అనే ఒక  చర్చకు వెళ్లేంతగా కోర్టు తీర్పులు ప్రజల మధ్య చిచ్చు పెట్టొచ్చునా అనేది ఇంకో ప్రశ్న? ఒక ప్రైవేటు స్తలానికి లేదా ఒక సమూహానికి చెందిన భూమి మీద ఇష్టారాజ్యం చేయడానికి న్యాయ స్థానాలకు ఏం హక్కు ఉందని అనే వారూ ఉన్నారు.

నిస్సందేహంగా దళితులకు ఆలయ ప్రవేశం, స్త్రీలకు చదువు, సమాన అవకాశాలు  అన్నప్పుడు ఇవే చర్చలు జరిగి ఉంటాయి. ఒక అంబేద్కరో, కందుకూరి వీరేశలింగమో ఇలాంటి చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొని ఉండకా మానరు. అయినా పరిస్థితులు ఎంతో కొంత మారిపోయాయి.  ఇది ఎలా సాధ్యమైంది? ఒక చట్టం మాత్రమే చేసి లేదా ఒక తీర్పు ఇచ్చేసి బలవంతంగా మత విశ్వాసాలు మార్చుకోండి అంటే అది చాలా ప్రమాదకరం. మతానికి చట్టానికి మధ్య జగడం పెట్టడం అంటే అది వినాశనమే. అలా ఎన్నటికీ ఎవరూ గెలిచి ఉండలేరు. దీన్ని సాధించేందుకు మనకు ఇంకా వేరే పద్ధతులేం లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. సామాజిక మార్పు, నిరంతర  చర్చ ద్వారా ఒక ఒత్తిడిని తీసుకురావొచ్చు, దాని ద్వారా మార్పును డిమాండ్ చెయ్యొచ్చు. మనకు ఒక విశ్వాసాన్ని నమ్మడానికి ఎంత హక్కు ఉందో దాన్ని నమ్మక పోవడానికి అంతే హక్కు ఉంది. వేరొక చోట మన భక్తి విశ్వాసాలను ప్రకటించుకునే హక్కు మనకూ ఉంది. అంబేద్కర్ అన్నట్టూ మనం ఆలయాల తలుపులు ప్రభుత్వ ఆదేశాలతో తెరించినంత మాత్రాన కుల వివక్షను, మత వివక్షను  రూపు మాపలేం. మన లక్ష్యం సమానత్వం ఐతే అది సిద్ధాంత రీత్యా ఉండాలి. ఆ కళ్ళ నుంచి నిత్యం చూడటం అవసరం. 1930లో హరిజనులకు ఆలయ ప్రవేశ ఉద్యమం జరుగుతున్నప్పుడు మతాన్ని వివక్ష నుండి ప్రక్షాళన చేయండి అని మహాత్మాగాంధీ‌తో అంబేద్కర్ అన్నారు. అలా చేయనప్పుడు దళితులు, నిమ్న కులాలు ఆలయ ప్రవేశం వద్దని తమకు తామే వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అంతే కాకుండా హిందూ మతాన్ని, విశ్వాసాన్ని వ్యతిరేకించే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఇది జరిగి 80 ఏళ్లు అయ్యింది. అంబేద్కర్ స్వయంగా మతం మారమని తన అనుయాయిలతో సహా బుద్ధిజం స్వీకరించినపుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హిందూ మతం ఏమైనా నేర్చుకుందా? లేదా ? అనేది ఎవరికీ తోచినట్టు వారు చెప్పుకుంటారు.

రాజ్యాగం పేరుతో రాజ్య వ్యవస్థ మన మీద రుద్దాలనుకునే విశ్వాసాలను మార్పులను కాదనడం కూడా మన జన్మ హక్కే. అంత మాత్రాన ధార్మిక సంస్థలు చెప్పే అభ్యంతరాలు సరైనవని అనడం కాదు. విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో లాజిక్ మిస్ అయింది. ఓ పక్క ఇది ప్రత్యేకమైన పవిత్రమైన స్థలం. ఇక్కడి ఆచార వ్యవహారాలు, భక్తి పూజలు, విశ్వాసాలను కాపాడుకోవాలని అరుస్తాం. మరో పక్క ఇంకో చోట – లింగాయతులో ఇంకొకరో మా విశ్వాసాలు వేరు మేము మీతో మీ మతంతో కలవం అంటే వాళ్లు  ఛాందసులని, అందరు సమానులే అని ప్రత్యేక సమూహం హోదా ఎలా ఇస్తారని అరుస్తాం. కొన్ని మందిరాలకు మతాలకు ప్రత్యేక ప్రమాణాలు గుర్తింపు ఎందుకని వాదిస్తే ఇంకో చోట ఇంకో సమూహం వాళ్ల వ్యవహారాలు మైనారిటీ కాక మానదు. మెజారిటీ విశ్వాసాలు ఇంకోలా ఉంటాయి మరి…

చాలా మంది వాక్స్వాతంత్రం పేరుతో, మతాన్ని విశ్వాసాన్ని వ్యతిరేకించే కుట్ర జరుగుతోందని అంటారు. కానీ ఇంకో మతాన్ని ఇష్టానుసారం కించపరిచే హక్కును మాత్రం వదులుకోరు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అలా ఉంటే వాక్స్వాతంత్రం విషయం‌లో అడ్డంగా ఉండే ఆర్టికల్ 295‌ Aని అదే కోర్టు ఏమని అనగలదు? ట్రిపుల్ తలాక్ అన్యాయమే.. అక్కడ మహిళల హక్కులకు భంగం కలిగినప్పుడు గుడి మెట్ల దగ్గర బహిష్టు ఆడవాళ్లను అడ్డుకుంటే అది వారిని అవమానించడం కాదు, మాది సంప్రదాయమంటే కుదరదు. మరి గోల్డెన్ టెంపుల్‌లో తల‌పాగా లేకుండా వెళ్లేందుకు హక్కును కోర్టులు కల్పిస్తాయా? సమాన హక్కులను.. ఆచారాలకు చెందిన ఒక అలవాటుతో పోల్చలేం!

పునరుత్పత్తి చేయగల వయసు ఉన్నవాళ్లు గుడి మెట్లు ఎక్కకూడదని ప్రస్తుతం ఓ ఉద్యమం నడుస్తోంది. భారత రాజ్యం మతాలకు చెందిన ఆస్తులు, వాటి నిర్వహణ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎప్పుడో మొదలు పెట్టింది. అది ఆధునిక రాజ్య భావన పునాదుల్లోనే ఉంది. అందులో మెజారిటీ మతం, మైనారిటీ మతం అన్న తేడా ఉండదు, ఉండకూడదు. అయితే ఈ పంచాయితీల్లో రాజ్యం ఎప్పటికి మునిగి తేలుతుండాలా? మరి పరిపాలనా, సంక్షేమం మాట ఏమిటి అంటే… నిజానికి లౌకిక రాజ్యం ఈ పంచాయితీల జోలికి రాకూడదు. అది కొందరి లేదా అందరి విశ్వాసాలను కాపాడే పేరుతో కొన్ని సార్లు జరగొచ్చు. అయితే అది లౌకిక పునాదులనే దెబ్బ‌తీసే విధంగా ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు రాజ్యం కూడా మతం చేసే పని చేస్తోంది కనుక. శబరిమలలో ఇప్పుడు జరుగుతున్న వివాదానికి పరిష్కారం ఎప్పటికి రాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మత విశ్వాసాలను మోస్తున్నాయిప్పుడు. అవి మారితే విశ్వాసాలు మారొచ్చు మారక పోవచ్చు కానీ వివాదాలు సమసిపోవు.

సంస్కరణలకు రాజకీయ పునాది అవసరం కానీ అది భక్తులను రాజ్యం మీదకు ఉసి గొలిపే విధంగా ఉండకూడదు. ఇప్పటి పరిస్థితి వేరు! లౌకికత్వం సనాతన ధర్మాన్ని మంట కలుపుతున్నదని దానికి బదులుగా మత రాజ్య  స్థాపన జరిగి తీరాలనే విపరీత వాదనలు జరుగుతున్న కాలం ఇది. అందుకే కొన్ని పార్టీలకు ఇది సంబరాలు చేసుకునే కాలం. పొగ రాజేసి చుట్ట కాల్చుకునే సరదా ఉన్నవాళ్లు రింగులు రింగులుగా తమ పైత్య విసర్జన చేసుకోవచ్చు.

ఆచారాలను సనాతన ధర్మాలను వ్యతిరేకించే హక్కు మనకున్నదని తెలుసుకుందాం. మన అమ్మలను, అక్కలను మంటల్లో కాలిపోకుండా కాపాడిన సంస్కరణలను మరిచిపోయి రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ చేసే వారిని  సమర్థించడం, పూల వర్షం కురిపించడం చేస్తే ఎల్లకాలం సాగిపోదు సుమా!. అయ్యా అప్పా.. అయ్యప్పా .. హరికి హరుడికి పుట్టేవని అంటారు. ఆడ వాసన లేకుండా దేవుడవు అయ్యవంటారు… కానీ వైష్ణవానికి శైవానికి మధ్య రక్తపాతాన్ని ఆపడానికి నువ్వు అవతారమెత్తావని కొందరంటారు. అంటే రెండు విశ్వాసాలకు సంధి చేసే శాంతిదూతవు కదా! హరుడికి సగం స్త్రీత్వమే ఐనప్పుడు ఆడవాసన అమ్మవాసన గిట్టని వాడవు ఎలా అవుతావు? గర్భగుడి అంటారు- గర్భస్థలం అంత పవిత్రమైనది కదా మరి అది మోస్తున్న వారు అపవిత్రమెలా అవుతారు. నీకు తెలుసేమో.. నీ భక్తులకు తెలియదు పాపం.

 

మహిర్ స్వరూప్ శర్మ,  ఆబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎన్డీటీవీ‌కి రాసిన కాలమ్‌కి స్వేచ్చానువాదం!