Sabarimala Ayyappa temple in Kerala records Rs 320 crore revenue
mictv telugu

రికార్డ్ స్థాయిలో శబరిమల ఆలయానికి భారీ ఆదాయం

January 20, 2023

Sabarimala Ayyappa temple in Kerala records Rs 320 crore revenue

దేశంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయం శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. ప్రతీ ఏడాది కేవలం మూడు నెలలపాటే తెరిచి ఉండే ఈ ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సీజన్ లో ఇప్పటివరకూ రూ. 320 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలిసింది. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు అధికారులు. 2018 సీజన్లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు.


అంతకుముందు కరోనా వైరస్ కారణంగా రెండేళ్లపాటు ఆలయానికి భక్తులను అనుమతించలేదు. ఈ సీజన్లోనే పూర్తి స్థాయిలో అనుమతించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చిన్నారులు సైతం స్వామి దర్శనానికి పోటెత్తారు. మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు. కాగా, హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తైందని అధికారులు తెలిపారు. కాయిన్లను లెక్కించాల్సి ఉందని తెలిపారు. ఇవి మరో రూ.7 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర కానుకలను కలుపుకొంటే.. మొత్తం ఆదాయం రూ.330 కోట్లపైగా కు చేరొచ్చని చెప్పారు.

ఇక ఏడాది వార్షిక మండలం-మకరవిళక్కు పుణ్యకాలం సందర్భంగా నవంబర్ 17 నుంచి అయప్ప స్వామి దర్శనాలు ప్రారంభం కాగా.. ఈరోజుతో ముగియనున్నాయి. శుక్రవారంతో ఈ వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుంది. మరోవైపు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించే విషయంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డొనేషన్లు, కరెన్సీ నోట్ల లెక్కింపు విషయంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని బోర్డుకు చెందిన విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.