నువ్వు ఆగమ్మా.. శబరిమలలో 12ఏళ్ళ బాలికకు నో - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వు ఆగమ్మా.. శబరిమలలో 12ఏళ్ళ బాలికకు నో

November 19, 2019

శబరిమలలో ఆలయంలోకి రుతుక్రమ వయసు ఆడవాళ్లను అడ్డుకోవడం కొనసాగుతోంది. తాజాగా అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చిన 12 ఏళ్ళ బాలికను పంబ బేస్ క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పుదుచ్చేరికి చెందిన ఆ బాలిక తన తండ్రి, బంధువులతో పాటు ఆ బాలిక వచ్చినట్లు సమాచారం. తండ్రి, బంధువులకు అనుమతివ్వడంతో వారు కొండపైకి వెళ్లారు. తండ్రి, బంధువులు తిరిగి వచ్చేవరకు బాలికను తాము బస చేసిన గదికి పంపించారు.

పోలీస్‌లు ఆ బాలిక వయసును ఆధార్ కార్డుతో నిర్దారించుకొని ఆలయంలోకి అనుమతించలేదని తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 మంది మహిళలను కూడా వెనక్కి పంపారు. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్ధం చేసింది. 2018, సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అయ్యప్పను పూజించవచ్చని తీర్పు వెల్లడించడంతో కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, భక్తులు వారిని అడ్డుకోవడం.. ఘర్షణ జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు.