ముట్టు‌గుడ్డను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్తామా.. స్మృతి ఇరానీ - MicTv.in - Telugu News
mictv telugu

ముట్టు‌గుడ్డను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్తామా.. స్మృతి ఇరానీ

October 23, 2018

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ‘నిషేధిత వయసు’ మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. అన్ని వయసుల మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లొచ్చన్న సుప్రీం కోర్టు తీర్పుపై తాను స్పందించనంటునే స్పందించారు.

‘ఇది కేవలం వ్యక్తుల ఇంగిత ఙ్ఞానంపై ఆధారపడిన అంశం. రుతుస్రావ సమయంలో వాడిన శానిటరీ న్యాప్‌కిన్లను స్నేహితుల ఇంటికైనా తీసుకెళ్తామా! అలా చేయం కదా. మరి దేవుడు ఉండే చోటుకి అలా వెళ్లడం ఎందుకు ? దీనిపై ఓసారి ఆలోచిస్తే మంచిది’ అని అన్నారు.

Amid Sabarimala Row, Smriti Irani's Sanitary Pad Comment, And A Question

అలాగే ‘దేవుడిని ప్రార్థించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కానీ హక్కుల పేరిట ఇలా ప్రవర్తించడం సరికాదు. ఒక మహిళగా నాకు కూడా అగ్నిదేవాలయం(జొరాస్ట్రియన్ల ప్రార్థనా స్థలం)లోకి ప్రవేశించే హక్కు లేదు. నా కుమారుడు ప్రార్థించడానికి వెళ్లిన సమయంలో బయటే అతడి కోసం ఎదురుచూస్తా. అలా అని దేవుడంటే నాకు నమ్మకం లేనట్లేనా?  అని స్మృతి ప్రశ్నించారు.

అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా తన ఇరుముడిలో సానిటరీ న్యాప్కిన్లను తీసుకువెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో స్మృతి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఓ కేంద్ర మంత్రి హోదాలో ఉండి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా వ్యాఖ్యలు చేసిన స్మృతిపై  సర్వాత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.