శబరిమలకు జాతీయ పుణ్యకేత్ర హోదా! - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమలకు జాతీయ పుణ్యకేత్ర హోదా!

December 3, 2017

హరిహరసుతుడు అయ్యప్పస్వామి కొలువై ఉన్న పవిత్ర శబరిమల ఆలయానికి జాతీయ పుణ్యక్షేత్ర హోదా సాధించడానికి కసరత్తు జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడి భక్తులు వస్తుండడంతో ఈ హోదా ఇస్తే బావుంటుందని ట్రావెంకోర్ దేవస్వాం బోర్డు, కేరళీయులు అభిప్రాయపడుతున్నారు. ఓఖీ తుపాను శబరిమల కొండల్లో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో భక్తుల మార్గాలకు ఆటంకాలు రాకుండా.. మౌలిక వసతుల కల్పనకు ఈ హోదా దోహదపడుతుందని ఆలయ అధికారులు చెప్పారు. దీనిపై ఇప్పుడిప్పుడే కసరత్తు మెదలుపెట్టామన్నారు.ఈ హోదా వస్తే ఆలయం అన్నవిధాలుగా అభివృద్ధి చెందుతుందని బోర్డు అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ చెప్పారు. ‘మేం ఈ అంశంపై అధ్యయనం చేశాం. అయితే కేరళలో ఇలాంటి హోదా ఉన్న గుడి ఏదీ లేదు. దీనిపై మరింత కసరత్తు చేయాలి’ అని అన్నారు.

మాజీ అధ్యక్షుడు ప్రయర్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ.. స్వామి గుడికి జాతీయ హోదా వస్తే రూ. 500 కోట్ల మేర నిధులు అందుతాయని, వాటితో విమానాశ్రయం, రైల్వే లైన్, జాతీయ రహదారి వంటి మౌలిక వసతులు కల్పించుకోవచ్చని అన్నారు. వరదులు వంటి ప్రకృతి విపత్తుల వల్ల భక్తుల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని, మౌలిక వసతులు వస్తే ఈ బాధ తప్పుతుందని అన్నారు. జాతీయ హోదా రావాలంటే చట్టాలను సవరించాల్సి ఉంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కుమనమ్ రాజశేఖరన్ చెప్పారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చట్టమూ లేదని, అయితే ప్రభుత్వం పూనుకుంటే సాధ్యం కానిదేమీ ఉండని శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన హైపవర్ కమిటీ మాజీ చైర్మన్ జయకుమార్ చెప్పారు.