అయ్యప్ప గుడికి తాళం! తెలుగు మహిళా జర్నలిస్టు వెనక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప గుడికి తాళం! తెలుగు మహిళా జర్నలిస్టు వెనక్కి..

October 19, 2018

యుద్ధరంగాన్ని తలపిస్తున్న శబరిమలలో మరో మలుపు. రుతుక్రమ వయసులో ఉన్న ఆడవారిని గుడిలోకి రానివొద్దంటూ నిరసనలు, దాడులు చేస్తున్న భక్తాదులకు ఆలయ ప్రధాన అర్చకుడు అండగా నిల్చారు.

trt

‘నేను భక్తులవైపు నిలబడుతున్నాను. ఆలయానికి తాళం వేసి తాళం చెవులును అధికారులకు అప్పగించాలని అర్చకులం నిర్ణయించుకున్నాం.. మరో దారేమీ కనిపంచడం లేదు’ అని ప్రధాన అర్చకుడు కందారారు రాజీవరు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇంకా గుడిని మూయనట్లు తెలుస్తోంది. అయ్యప్ప ఆలయంలోకి ముగ్గురు మహిళలు వస్తున్నారని, వారికి రక్షణగా పోలీసులు వస్తున్నారని తెలియడంతో ప్రధాన అర్చకుడు బెదిరించడానికి ఆలయానికి తాళం వేస్తామని హెచ్చరించినట్లు అధికారులు చెబుతున్నారు. షెడ్యూలు ప్రకారం గుడిని ఈ నెల 22వరకు తెరిచి ఉంచుతారు.

మరోపక్క.. ఎవరు అడ్డుకున్నా లెక్కచేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మహిళలను ఆలయంలోకి తీసుకెళ్తామని కేరళ ప్రభుత్వం, పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే సన్నిధానం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆడవాళ్లను రానివ్వబోమని, వారిని అడ్డుకోడానికి దేనికైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా, పోలీసు రక్షణతో గుడిలోకి వెళ్లడానికి యత్నించి హైదరాబాద్‌లోని మోజో టీవీకి చెందిన  తెలుగు జర్నలిస్టు జక్కల కవిత, కేరళ మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాలు నిరసనకు తట్టుకోలేక వెనక్కి తిరిగారు. వీరు గుడికి 500 మీటర్ల దూరం వరకు వెళ్లగలిగారు. అయితే మైసూరుకు చెందిన 45 ఏళ్ల మేరీ స్వీటీ అనే మహిళ పోలీసుల రక్షణతో ముందు సాగుతున్నారు.

తాజా వార్త.. కవిత, రెహానాలు వెనక్కి వెళ్లిపోవడంతో గుడిలో యథావిధిగా పూజలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ తలుపులు మూసివేశారన్న ప్రచారంలో నిజం లేదని, ఆవేశంతో ప్రధాన పూజారి అలా చెప్పారని వివరణ ఇచ్చింది.