చక్రం అడ్డేసిన ప్రియాంక.. దారికొచ్చిన పైలట్ - MicTv.in - Telugu News
mictv telugu

చక్రం అడ్డేసిన ప్రియాంక.. దారికొచ్చిన పైలట్

July 13, 2020

Priyanka Gandhi

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద ఉప ముఖ్యమంత్రి, పీసీసీ సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగరవేసినట్టే వేసి చల్లబడ్డారు. 25 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని.. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్‌ ఇంతలోనే వెనక్కు తగ్గారు.    పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి వారి మధ్య చక్రం అడ్డేసి రాజీ కుదిర్చారు. ఈ మేరకు పైలట్‌ పలు డిమాండ్లను పార్టీ ముందు ఉంచారు. పార్టీ చీఫ్‌గా తనను కొనసాగించాలని..తన వర్గానికి నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కీలక ఆర్థిక, హోంశాఖలను కూడా తమకే కేటాయించాలని కోరారు. ఈ విషయమై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఇదిలావుండగా ఢిల్లీ, జైపూర్‌ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా నడిచింది. ‘నా ప్రభుత్వం మైనారిటీలో పడలేదు. నాకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నంబర్‌ గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ ఎన్నికలకు ముందే ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ సిగ్గులేని చర్యలకు పాల్పడుతోందని.. ఇందుకోసం రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని గెహ్లాట్ ఆరోపించిన విషయం తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా బీజేపీ కుట్రలను ఎండగట్టారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని అన్నారు. ‘200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కే  మద్దతు ఇస్తున్నారు’ అని సుర్జేవాలా తెలిపారు. కాగా, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీపై ఆసక్తి నెలకొంది.