Sachin Pilot On PM's Praise For Ashok Gehlot
mictv telugu

కాంగ్రెస్‌లో మోదీ చిచ్చు..!

November 2, 2022

కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రశంసల చిచ్చురేగింది. ఉప్పు-నిప్పు మధ్య మంటలు రాజేసింది. పంచాయితీ కొత్తగా వచ్చిన అధక్షుడు మల్లికార్జున్ ఖర్గే దాకా వెళ్లింది.ఇంతకీ కాంగ్రెస్‌లో మోదీ రేపిన చిచ్చు ఏంటంటే…

గెహ్లాట్ పై మోదీ ప్రశంసలు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ ని ఆయన పొగిడారు. ఇక అంతే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో కాక రేపింది. సచిన్ పైలట్‌కు ఎక్కడో కాలింది. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అశోక్ గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కోరారు. ” గులాం నబీ ఆజాద్ ని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ పొగిడారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇప్పుడు అశోక్ గెహ్లాట్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. మోదీ పొగిడినోళ్లెవరూ పార్టీలో ఉండటం లేదు”అని సచిన్ పైలట్ అన్నారు.

అసలేం జరిగిందంటే

బ్రిటీష్ హయాంలో ఊచకోతకు గురైన 15 వందల మంది గిరిజనుల త్యాగాలకు గుర్తుగా రాజస్థాన్‌లోని బాంస్‌వాడా జిల్లాలోని మాన్‌గడ్ ధామ్ దగ్గర స్మారక స్థూపాన్ని నిర్మించారు.జాతీయ స్మారక చిహ్నంగా ప్రధాని మోదీ ప్రకటించారు. గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కలిసి అశోక్ గెహ్లాట్ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మోదీపై గెహ్లాట్ ప్రశంసల వర్షం కురించారు. గాంధీజీ నడయాడిన,ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్న దేశానికి ప్రధాని కావడంతో మోదీకి ప్రపంచమంతా అమితమైన గౌరవిస్తుందన్నారు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని, అందుకే ప్రజలు గౌరవిస్తారని అశోక్ చెప్పారు. అశోక్ గెహ్లాట్ ,తాను సీఎంగా పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రులుగా ఇద్దరం కలిసి పనిచేశామని మోదీ చెప్పారు. వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్ అశోక్ గెహ్లాట్ అని మోదీ అన్నారు.

రాజస్థాన్‌లో రచ్చ

ఇదే ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌లో రచ్చకు దారితీసింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సచిన్ పైలట్ ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. అశోక్ గెహ్లాట్‌కు సచిన్ పైలట్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సర్కార్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి.వైరి వర్గాలు ఎత్తుకుపైఎత్తులేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని గెహ్లాట్‌ని సోనియాగాంధీ కోరారు. కానీ రాజస్థాన్ సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. జోడు పదవులు కుదరవని ఆయన్ను పక్కన పెట్టేశారు. ఇంతలోనే సచిన్ పైలట్ సీఎం కాబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అంతే అశోక్ వర్గం మూకుమ్మడిగా రాజీనామాలతో పైలట్ ప్రయత్నాల్ని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అవకాశం ఎదురుచూస్తున్నారు సచిన్ అశోక్ గెహ్లాట్ ని ఇరికించే ప్రయత్నించారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన సీఎల్పీ సమావేశాన్ని ఇప్పటివరకు నిర్వహించలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌ని కోరారు.