సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ నోటీసులు

April 25, 2019

భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా ఉంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సలహాదారులుగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు పంపారు. వాస్తవానికి బీసీసీఐకి సేవలందిస్తోన్న సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయినప్పటికీ నోటీసులు అందుకోవడం గమనార్హం.

Sachin Tendulkar, VVS Laxman Served Notice For Conflict Of Interest

భారత జట్టుకు కోచ్‌ నియామకంతో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాల కోసం బీసీసీఐ కొన్ని సంవత్సరాల క్రితం సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ ముగ్గురూ జీతాలేమీ తీసుకోకుండా ఉచిత సేవే చేస్తున్నారు. అయినప్పటికీ ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు మెంటర్స్‌గా ఉంటూ ఈ కమిటీలో ఎలా కొనసాగుతారంటూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌.. సచిన్‌, లక్ష్మణ్‌లకు నోటీసులు పంపారు. ఈ నోటీసులకు సచిన్, లక్ష్మణ్ ఈనెల 28లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.