పెరియార్‌ను కూల్చారని జంధ్యాలు కోశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెరియార్‌ను కూల్చారని జంధ్యాలు కోశారు..

March 7, 2018

తమిళనాడులో బీజేపీకి, ద్రావిడ పార్టీలకు మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. త్రిపురలో బీజేపీ కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని కూల్చేసినట్లే తమిళనాడులో పెరియార్ విగ్రహాలను కూల్చేస్తామని తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా చేసిన ప్రకటన ఘర్షణలకు దారితీస్తోంది. ఇప్పటికే పెరియార్ రామస్వామి విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కూల్చగా, కోయంబత్తూరులోని బీజేపీ ఆఫీసుపై ద్రావిడ సంఘాల కార్యకర్తలు పెట్రోల్ బాంబు విసిరారు.

మరోపక్క రాజధాని చెన్నైలో బుధవారం ద్రావిడ కార్యకర్తలు.. 8 మందిని ఒడిసిపట్టుకుని వారి జంధ్యాలను తెంచేశారు. మైలాపూర్‌లో బుధవారం ఉదయం ఈ ఉదంతం చోటుచేసుకుంది. ద్రావిడర్ విడుదలై కళగంకు చెందిన నలుగురు కార్యకర్తలు నల్లతంబి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వారిలో 8 మందిని పట్టుకుని చొక్కాలు విప్పేసి జంధ్యాలను తెంచేశారు.

తర్వాత పెరియార్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. బాధితులు బ్రాహ్మణులుగా భావిస్తున్నామని, అయితే వారు తమకింకా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. తామే జంధ్యాలను తెంచేశామంటూ నలుగురు యువకులు రావణన్, భూపతి, పార్తిబన్, రాజేశ్‌లు  రాయపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.