మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాల్లో ఇద్దరు సాధువుల హత్య గురించి మరువక ముందే అదే రాష్ట్రంలోని నాందేడ్‌లో మరో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడుగా భావిస్తున్న భగవాన్ షిండేని వారి ఆశ్రమంలోనే దుండగుడు హత్య చేశాడు. ఆశ్రమంలోని బాత్ రూమ్ వద్ద వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య కేసును 24 గంటల్లోపే ఛేదించారు తెలంగాణ పోలీసులు. ఆశ్రమంలోని వస్తువులను దోపిడీ చేయడానికే దుండగులు ఇందులో ప్రవేశించారని, వారిని ఎదిరించబోయిన శివాచార్యను గొంతు నులిమి హతమార్చారని, ఈ హత్యాకాండను కళ్లారా చూసిన భగవాన్ షిండేని కూడా హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
లక్షన్నర విలువైన వస్తువులను దుండగుడు దోపిడీ చేసి మృతదేహాలను కారులో ఎక్కించుకునే క్రమంలో స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. దీంతో హంతకుడు అక్కడినుంచి పరారయ్యాడు. అక్కడినుంచి తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూరుకు చేరుకున్నాడు. ఈ ఘటనపై మహరాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో స్పెషల్ పార్టీ పోలీసులతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానస్పదంగా తిరుగుతున్న సాయినాథ్ శింఘాడేని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో డబ్బు, బంగారం కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.