Sagar left canal is breached in nidamanooru
mictv telugu

సాగర్ ఎడమ కాల్వకు గండి.. నీట మునిగిన గ్రామాలు, పొలాలు…

September 8, 2022

Sagar left canal is breached in nidamanooru

నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. దీంతో ఒక్కసారిగా సమీప గ్రామాలు, పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన వల్ల రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోగా, ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ గండి పడగా, సమీప గ్రామాలైన లక్ష్మీదేవి గూడెం, నిడమనూరు, ముప్పారం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నిడమనూరు మండల కేంద్రంలో ఉన్న పెట్రల్ బంకు పూర్తిగా మునిగిపోయింది. అక్కడే ఉన్న మినీ గురుకుల పాఠశాలలో వేగంగా వరద నీరు ముంచెత్తగా 87 మంది విద్యార్ధులను వార్డెన్ స్థానిక ఫంక్షన్ హాలుకి తరలించారు. అటు గండి పడిన విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నా.. కాలువ నుండి 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండడంతో సహాయ చర్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే దిగువకు వెళ్తున్న నీరు కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండడంతో హాలియా వద్ద వాటర్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి కాలువ కట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గండి కాలువ మధ్యలో పడడంతో పనులు పూర్తవ్వడానికి సమయం పడుతుందని వివరించారు. దీని వలన నష్టపోయిన వారిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గండిని పూడ్చి ఐదారు రోజుల్లో నీటి విడుదలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.